ZEE Movies Creative Director Komal Nahta: ప్రముఖ మీడియా దిగ్గజ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) తమ సినీ వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన జీ స్టూడియోస్, మూవీస్ అక్విజిషన్ విభాగాలను పునర్వ్యవస్థీకరించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా భారతీయ చలనచిత్ర రంగంలో 40 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉన్న ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, సినీ విమర్శకుడు కోమల్ నహతాను జీ మూవీస్ విభాగానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా నియమించింది. సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులను సరైన దిశలో నడిపించడం.. నిర్ణయాధికార ప్రక్రియను సులభతరం చేయడం, ప్రొడక్షన్, కమిషనింగ్, అక్విజిషన్, పంపిణీ విభాగాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచి వేగవంతమైన వృద్ధిని సాధించడమే లక్ష్యంగా సంస్థ ఈ మార్పులు చేసినట్లు ZEEL వెల్లడించింది.
సినిమాల నిర్మాణం, కొనుగోళ్లు, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలను ఒకే తాటిపైకి తెచ్చి కార్యాచరణను మరింత వేగవంతం చేయడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది. నూతన వ్యవస్థ ప్రకారం.. జీ స్టూడియోస్ హెడ్ సూరజ్ సింగ్‌తో పాటు స్టూడియో బృందం మొత్తం కోమల్ నహతా పర్యవేక్షణలోనే పనిచేయనుంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషా చిత్రాల కమర్షియల్ హక్కులు, డిజిటల్ శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం సినిమాల కొనుగోళ్లు, భవిష్యత్ ప్రాజెక్టుల ఎంపిక, ఇన్వెస్ట్‌మెంట్‌లపై నహతా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ బాధ్యతల్లో వ్యూహాత్మక మార్గదర్శకత్వం కోసం నహతా నేరుగా సంస్థ సీఈవో పునిత్ గోయెంకాకు రిపోర్ట్ చేస్తారు.
ప్రస్తుత అటెన్షన్ ఎకానమీలో అత్యధిక వాటాను దక్కించుకోవడానికి, సినీ ఇండస్ట్రీ విభాగంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టడానికి, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన బలమైన వ్యవస్థను నిర్మించడానికే ఈ సంస్కరణలు చేపట్టినట్లు సంస్థ పేర్కొంది. దీని ద్వారా థియేట్రికల్, టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో జీ గ్రూప్ తన సినిమాల పోర్ట్‌ఫోలియో వ్యూహాన్ని మరింత పటిష్ఠం చేయనుంది.
ఎవరీ కోమల్ నహతా..?
సినీ పరిశ్రమలో ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్, సినీ విమర్శకుడు, ప్రచురణకర్తగా కోమల్ నహతాకు విశేష గుర్తింపు ఉంది. ప్రతిష్ఠాత్మక సినీ ట్రేడ్ మ్యాగజైన్ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ పబ్లిషర్‌గా పనిచేస్తున్నారు. గతంలో జీ నెట్‌వర్క్‌కు చెందిన ఈటీసీ ఛానెల్‌లో దాదాపు పదేళ్ల పాటు బాలీవుడ్ బిజినెస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రముఖ సినీ పెట్టుబడి సంస్థ 'సినిమా క్యాపిటల్' అడ్వైజరీ బోర్డులోనూ సేవలందించారు.
ఈ నియామకంపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో పునిత్ గోయెంకా మాట్లాడుతూ.. "మేము ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్నాం. ఈ క్రమంలో మా వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. పనితీరు ఆధారిత నిర్వహణ వ్యవస్థను నిర్మించడంలో మా దీర్ఘకాలిక నిబద్ధతకు ఈ నిర్ణయం నిదర్శనం. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా విభాగంలో మా పెట్టుబడులకు సరైన విలువను చేకూర్చడానికి సృజనాత్మక నైపుణ్యాన్ని, వాణిజ్య క్రమశిక్షణను ఒక్కచోటకు చేరుస్తున్నాం. సినిమా పరిశ్రమపై కోమల్ నహతాకు ఉన్న అపారమైన అనుభవం, పరిశ్రమ వర్గాలతో ఉన్న బలమైన సంబంధాలు మా తదుపరి వృద్ధి ప్రయాణంలో బృందాలను నడిపించడానికి ఎంతగానో దోహదపడతాయని నమ్ముతున్నాను" అని అన్నారు.
కోమల్ నహతా మాట్లాడుతూ.. "జీ సంస్థకు చెందిన ETC ఛానల్‌లో దాదాపు దశాబ్దం పాటు అత్యంత ప్రజాదరణ పొందిన బాలీవుడ్ బిజినెస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించాను. అందుకే ఈ నియామకం నాకు సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని కలిగిస్తోంది. సంస్థ వ్యవస్థాపకులు సుభాష్ చంద్ర, సీఈవో పునిత్ నాపై ఎంతో నమ్మకం ఉంచి ఇంతటి భారీ బాధ్యతను అప్పగించారు. వారిపై నాకు అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయి. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జీ సినీ విభాగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను" అని తెలిపారు.