SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రైల్వే ఉద్యోగులకు కేంద్రం ఫెస్టివల్ గిఫ్ట్.. బోనస్‌ చెల్లింపునకు గ్రీన్‌ సిగ్నల్.. ఎవరికి ఎంతంటే..?

Railway Employees Bonus 2026: దసరా, దీపావళి పండుగల వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) చెల్లింపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 11.40 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Written By Ashok Krindinti
Published: Oct 14, 2026, 07:39 PM IST | Updated: Oct 14, 2026, 07:40 PM IST
Image Credit: Railway Employees Bonus 2026 (Source: ChatGPT)
Join

Railway Employees Bonus 2026: పండుగల వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల వేళ ఏటా ఇచ్చే  ఉద్యోగులు కనబరిచిన పనితీరు ఆధారంగా ఇచ్చే ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్‌‍బీ) చెల్లింపుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. రైల్వే సిబ్బంది కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు రూ.2009.61 కోట్ల మొత్తం 78 రోజుల బోనస్ చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏడాది దుర్గాపూజ లేదా దసరా సెలవులకు ముందు ఈ పీఎల్‌బీని చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సంవత్సరం కూడా దాదాపు 11.40 లక్షల మంది నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. రైల్వే వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా మెరుగ్గా పనిచేసేందుకు ఉద్యోగులకు ఒక ప్రోత్సాహకంగా ఈ బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుంది. అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గరిష్ఠంగా రూ.17,951 అందుతుంది. ట్రాక్ మెయింటెనెర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ 'సీ' విభాగాలకు చెందిన వివిధ విభాగాల రైల్వే సిబ్బందికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ - RPF సిబ్బందికి మాత్రం నిబంధనల ప్రకారం ఈ బోనస్ వర్తించదు.

2025-26 సంవత్సరంలో రైల్వేల పనితీరు అత్యంత ప్రశంసనీయంగా నమోదు కావడం గమనార్హం. భారతీయ రైల్వేలు రికార్డు స్థాయిలో 1670 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయటమే కాకుండా దాదాపు 7.41 బిలియన్ల (741 కోట్లు) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

బోనస్ లెక్కింపు ఇలా.. 

ఒక్కో ఉద్యోగి ఖాతాలో గరిష్టంగా రూ.17,951 జమ అవుతుంది. బోనస్ లెక్కించేందుకు కేంద్రం నెలకు రూ.7 వేల వేతన పరిమితిని ప్రామాణికంగా తీసుకుంటోంది. 2014-15 నుంచి ఈ సీలింగ్ మారలేదు. అందువల్ల ఉద్యోగి అసలు జీతం ఎంత ఉన్నా.. బోనస్ మొత్తం మాత్రం రూ.17,951 దాటదు. రెండు మూడు రోజుల్లోనే పండుగ ఖర్చుల కోసం ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

పాత ఫార్మూలతో నష్టం..

ఈ రూ.7 వేల పరిమితిని ఎత్తివేయాలని రైల్వే యూనియన్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. 7వ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత కనీస మూల వేతనం రూ.18 వేలు అయిందని.. దీనికి డీఏ కలిపి బోనస్ లెక్కించాలని కోరుతున్నాయి. అలా లెక్కిస్తే 78 రోజులకు దాదాపు రూ.46,184 రావాల్సి ఉంటుందని ఉద్యోగులు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి పాత ఫార్ములానే కొనసాగిస్తోంది. గతేడాది 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రభుత్వం 78 రోజుల బోనస్‌ను ఇచ్చింది. దీనికోసం కేంద్ర ఖజానా నుంచి రూ.1,865 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాది కూడా దాదాపు 11.72 లక్షల మందికి రూ.2,028 కోట్లు విడుదల చేశారు. తాజాగా రూ.2009.61 కోట్ల మొత్తం బోనస్‌గా చెల్లించనున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES