Meerut Wife On Car Bonnet: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో తీవ్ర కలకలం రేపిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాజీపుర్ ప్రాంతానికి చెందిన సునీత (32) అనే మహిళకు మయాంక్ (36)తో వివాహమైంది. అయితే, మయాంక్‌కు మహీ వర్మ (34) అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శనివారం సాయంత్రం మీరట్‌లోని ఓ వీధిలో మయాంక్, మహీ వర్మలు కలిసి మోమోస్ తింటుండగా సునీత అక్కడికి చేరుకుని భర్తను నిలదీసింది.
తన రహస్య వ్యవహారం బయటపడటంతో తీవ్ర భయాందోళనకు గురైన మయాంక్, వెంటనే కారు డోర్లు లాక్ చేసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. సునీత కారు కిటికీలపై కొడుతూ, వాహనానికి అడ్డుగా వచ్చి బోనెట్‌ను గట్టిగా పట్టుకుంది. అయినప్పటికీ మయాంక్ కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. కారు వేగంగా వెళ్తుండటంతో ప్రాణభయంతో సునీత 'భయ్యా! బచావో' (అన్నా నన్ను కాపాడండి) అని గట్టిగా అరుస్తూ దారిన వెళ్లేవారి సహాయం కోరింది.
అలాగే కారు బోనెట్‌పై సునీతను దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. సునీత కేకలు విన్న స్థానికులు ఒక్కసారిగా వాహనానికి అడ్డుపడి గుమిగూడటంతో మయాంక్ కారును నిలిపివేయక తప్పలేదు. అనంతరం బాధితురాలు సునీత స్థానిక కోత్వాలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, కట్నం కోసం వేధించాడని మరియు తనను హత్య చేసే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది.
సునీత ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, కోత్వాలి సర్కిల్ ఆఫీసర్ సంగ్రామ్ సింగ్ పర్యవేక్షణలో విచారణ చేపట్టి మయాంక్, మహీ వర్మల ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులిద్దరినీ అరెస్టు చేసి, ఈ నేరంలో ఉపయోగించిన 'టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్' కారును (రిజిస్ట్రేషన్ నంబర్ UP15 ER 3086) స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.