Mumbai Crime News: డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలంటే సాధారణంగా వైద్యులు ఏం చేస్తారు..? మృతదేహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి.. పరీక్షలు నిర్వహించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ఓ వైద్యుడు మాత్రం వెరైటీగా డెత్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు. కనీసం మృతదేహాన్ని చూడకుడా.. కేవలం వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూసి డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అంతటితో ఆగకుండా.. తుపాకీ తూటాలకు బలైన వ్యక్తిని గుండెపోటుతో మరణించాడంటూ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి చివరకు జైలు పాలయ్యాడు. వాట్సాప్ వీడియో కాల్‌లో మృతదేహాన్ని చూసి మరణ ధృవీకరణ పత్రం జారీ చేశారన్న ఆరోపణలపై ముంబైకి చెందిన ఒక వైద్యుడిపై కేసు నమోదైంది.
వివరాలు ఇలా..
మహారాష్ట్రలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ పరిధిలో నలుగురు వ్యక్తులు అడవి పందులను వేటాడేందుకు అక్రమంగా లోపలికి ప్రవేశించారు. అయితే ఆ సమయంలో పార్కు పరిసరాల్లో ఉన్న ఓ మున్సిపల్ కార్మికుడిని అడవి పందిగా భావించిన వారు.. వెంటనే తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ గాయాలతో ఆ కార్మికుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ హత్యను కప్పిపుచ్చేందుకు నిందితులు కుట్ర పన్నారు. కాశీగావ్‌లోని ఆశిష్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పాండురంగ్ పాలండే (56)ను సంప్రదించారు. రూల్స్ ప్రకారం డాక్టర్ స్వయంగా మృతదేహాన్ని పరిశీలించాలి. కానీ నిందితులతో చేతులు కలిపిన డాక్టర్ పాలండే.. కేవలం వాట్సాప్ వీడియో కాల్ ద్వారానే మృతదేహాన్ని చూశాడు. బుల్లెట్ గాయాలతో చనిపోయిన వ్యక్తి 'కార్డియాక్ అరెస్ట్' కారణంగానే చనిపోయాడని ధ్రువీకరిస్తూ డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు.
ఈ అనుమానాస్పద వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టారు. విచారణలో నిందితులు చేసిన నేరం.. దాన్ని దాచేందుకు డాక్టర్ ఇచ్చిన తప్పుడు డెత్ సర్టిఫికెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు డాక్టర్ రాజేష్ పాండురంగ్ పాలండేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై డీసీపీ మీరా రాహుల్ చవాన్ మాట్లాడుతూ.. ఆ వైద్యుడు మృతదేహాన్ని స్వయంగా పరిశీలించకుండా.. కేవలం వాట్సాప్ వీడియో కాల్ ఆధారంగా డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడని తెలిపారు. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చినందుకు.. హత్య కేసులోని నిందితులు నేరాన్ని కప్పిపుచ్చేందుకు సహకరించినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అడవి పంది వేటలో ఓ నిండు ప్రాణం బలికావడం.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఓ డాక్టర్ ఈ స్థాయిలో దిగజారి వ్యవహరించడం స్థానికంగా కలకలం రేపింది.