PM Kisan Money: దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్రంలోని నరేంద్ర సర్కారు తీపి కబురు చెప్పింది. దీపావళి పండుగ పురస్కరించుకునొ రైతులకు కానుకగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత సొమ్మును విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 2వేల రూపాయల చొప్పును నేరుగా జమ చేయనున్నారు.
రబీ పంటల పెట్టుబడికి సరిగ్గా పండుగ ముందు ఈ ఆర్థిక సాయం అందుతుండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథక ప్రయోజనం దక్కాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇప్పటివరకు తమ ఖాతాకు ఇ-కేవీసీ ప్రక్రియను పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కావని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాబట్టి రైతులు వెంటనే తమ సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి లేదా పీఎం కిసాన్ పోర్టల్/యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలిని సూచించింది. దీనితో పాటు భూమి వివరాల ధ్రువీకరణ, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం పూర్తయిన వారికి మాత్రమే ఈ విడత సొమ్ము త్వరలోనే జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ఇతోధికంగా ఆర్ధిక సాయం అందిస్తున్నాయి.