SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

Supreme Court of India: జర్నలిజం హోదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ప్రతి పౌరుడు కూడా తనను తాను జర్నలిస్ట్ గా ప్రకటించుకోవడం ప్రారంభించే పరిస్థితి వస్తే.. అది భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు..గందరగోళానికి దారితీస్తుందని స్పష్టం చేసింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 16, 2026, 10:39 AM IST | Updated: Oct 16, 2026, 10:40 AM IST
Image Credit: Supreme Court of India
Join

Supreme Court of India: జర్నలిజం హోదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ప్రతి పౌరుడు కూడా తనను తాను జర్నలిస్ట్ గా ప్రకటించుకోవడం ప్రారంభించే పరిస్థితి వస్తే.. అది భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు..గందరగోళానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేసిన ఫ్రీలాన్సర్లు.. ఇండిపెండెంట్ జర్నలిస్టులు.. రీల్స్ చేసేవారికి రక్షణ కల్పించాలంటూ కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఫ్రీలాన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులను ఢిల్లీ పోలీసులు గుర్తించలేదని.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లారు. మీడియా సంస్థలు జారీ చేసిన ఐడీ కార్డులు ఉన్న జర్నలిస్టుల విధులకు ఆటంకం కలగకుండా జాతీయ స్థాయిలో ఒక ప్రోటోకాల్ రూపొందించాలని కోరారు.

 సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ పాత్రికేయులుగా మారితే తలెత్తే సమస్యలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి అని హెచ్చరించారు. ఆర్టికల్ 19 కింద భావప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరుడికి పాత్రికేయుడిగా మారే హక్కును కల్పిస్తుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి సమగ్ర పరిశీలన అవసరమని జస్టిస్ బాగ్చి అన్నారు. గుర్తింపు పొందిన పాత్రికేయులు, ఫ్రీలాన్స్ పాత్రికేయులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీలర్లకు వివిధ హోదాలలో రక్షణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ప్రజాదరణ కోసం రీల్స్ సృష్టించి, తమను తాము స్వతంత్ర పాత్రికేయులుగా పిలుచుకుంటున్నారని అన్నారు. మహిళా పాత్రికేయులకు వేధింపుల నుండి రక్షణ కల్పిస్తూనే, అదే రక్షణను మహిళా పోలీసు సిబ్బందికి కూడా విస్తరించాలని ఆయన వాదించారు.

వివిధ వర్గాల పాత్రికేయులకు అదనపు భద్రత కల్పించే అంశంపై సమగ్ర దర్యాప్తు అవసరమని ధర్మాసనం పేర్కొంది. నిరసనల సమయంలో మహిళా పాత్రికేయులపై దాడులు, వేధింపుల ఆరోపణలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, స్వతంత్ర దర్యాప్తు అవసరాన్ని పరిశీలిస్తామని   సూచించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES