Uttar Pradesh Telugu News: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మంచి మెరుగైన వైద్యం అందుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఎన్నో హీనమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ప్రసవ వేదనతో విలవిల్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణిని కనికరించాల్సింది పోయి, సిబ్బంది కనికరం లేకుండా బయటకు గెంటేశారు. లాస్ట్‌లో ఆ మహిళ ఆసుపత్రి ముందే నడిరోడ్డుపై.. దుప్పట్ల చాటున పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన జ్ఞాన్‌పూర్‌లోని మహారాజా చేత్ సింగ్ జిల్లా ఆసుపత్రిలో వెలుగుచూసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
జోరయీం గ్రామానికి సంబంధించిన 20 ఏళ్ల గిరిజన మహిళ రాణీ దేవికి అర్ధరాత్రి విపరీతమైన నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో జ్ఞాన్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు.. అయితే, అక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ నీలం మౌర్యతో పాటు వైద్యులు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు.. అంతేకాకుండా ఆమె రక్తహీనత ఉందని.. తక్షణమే బనారస్ హిందూ యూనివర్సిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ చేతులెత్తేశారు.
గతంలో కూడా ఆమెను మీర్జాపూర్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయగా.. అక్కడ కూడా చేర్చుకోకపోవడానికి నిరాకరించడంతో.. చేసేదేమీ లేక మళ్లీ ఇక్కడికే వచ్చామని బాధితురాలి బంధువులు ఎంతగానో అధికారుతో వేడుకున్నప్పటికీ.. కనికరించలేదు. పైగా తమను కులం పేరుతో అవమానించి.. ముసహర్ వర్గం వారికి ఇక్కడ కాన్పు చేయం.. అంటూ నెట్టేశారని బాధితురాలి సోదరుడు విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు..
అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది.. చేర్చుకోకపోవడంతో చేసేదేమీ లేక గర్భిణిని తీసుకుని బంధువులు ఇంటి వెళ్లాలనుకున్నారు. అయితే, ఆసుపత్రి గేట్ వద్దకు రాగానే నొప్పులు తీవ్రం కావడంతో ఆ మహిళ ఇక అడుగు కూడా ముందుకు వేయలేక రోడ్డుపైనే కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.. స్థానిక మహిళలు వెంటనే స్పందించి.. రోడ్డు పక్కనే దుప్పట్లను అడ్డుగా పట్టి మానవతా దృక్పథంతో ఆమెకు కాన్పు చేసిన్నట్లు తెలుస్తోంది.
రోడ్డుపై ప్రసవం జరిగిన విషయం బయటకు రావడంతో జిల్లా యంత్రాంగం కూడా స్పందించిన్నట్లు తెలుస్తోంది.. సీఎంవో (చీఫ్ మెడికల్ ఆఫీసర్) డాక్టర్ ఎస్.కే. చక్ వెంటనే బాధితురాలి ఇంటికి చేరుకుని.. తల్లీబిడ్డలను స్వయంగా జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించేలా చేశారు.. ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వారికి ప్లాస్మా అందించి పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.