‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఆ తర్వాత కూడా యూత్‌ఫుల్ స్టోరీల్లో నటిస్తున్నాడు. ఈ కోవలో నక్షత్రతో కలిసి ‘తెల్లకాగితం’ చిత్రంలో యాక్ట్ చేశాడు. కొత్త డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 2న ఆడియన్స్ ముందుకు రాబతుంది. టీనేజ్ వయసులో తెలియక చేసే తప్పులు, వాటి ప్రభావం, కుటుంబ బంధాలు, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
రాము (హర్ష్ రోషన్) పేరేంట్స్ చనిపోవడంతో అన్నా వదినలే అతన్ని పెంచి పెద్ద చేస్తారు. ఆ తర్వాత పదో తరగతిలో తన సహ విద్యార్ధిని అయిన ఆశ (నక్షత్ర) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రేమగా మొగ్గ తొడుతుంది. ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా దగ్గరవుతారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. తెల్ల కాగితం లాంటి వాళ్ల జీవితంలో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల వల్ల రాము, నక్షత్రలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. చివరకు ఏం అయిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు బండ్రెడ్డి రమేశ్ రెడ్డి.. ప్రస్తుతం యువత చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పేరుతో ఎలా తమ జీవితాలను దుర్భరం చేసుకుంటారనే విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి కథతో గతంలో చిత్రం సహా పలు చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యార్ధుల జీవితాలు తెల్ల కాగితం లాంటివి. వాటిని ఎలా రాసుకుంటే అలా మనం జీవితం ఉంటుందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముఖ్యంగా తెలిసీ, తెలియని వయసులో చేసే ఇద్దరు యువతీ యువకులు చేసే తప్పుల కారణంగా వాళ్లిద్దరితో పాటు వాళ్ల కుటుంబం ఎలా ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని చూపెట్టే ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.
ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్.. ఆసక్తిగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను దర్శకుడు అప్పటి కాలానికి అనుగుణంగా అమాయకత్వాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.ముఖ్యంగా ప్రేమ గొప్పదే కానీ.. ఇద్దరి ప్రేమ వల్ల రెండు కుటుంబాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటారు. వారి భావి జీవితం బుగ్గి పాలవుతుందనే విషయాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. ప్రేమ గొప్పదే కానీ.. దానికి ఓ వయసు, అవగాహన వచ్చాకా చేస్తే బాగుంటుంది.
ఇప్పటికే ఇలాంటి సబ్జెక్ట్స్‌తో పలు చిత్రాలు వచ్చాయి. సెకండాఫ్ ను మరింత గొప్పగా తీర్చిదిద్దే అవకాశమున్న.. ఏదో సోసోగా లాగించేాడు. క్లైమాక్స్ ఆలోచనను రేకిత్తించింది. సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ బుల్గానిన్ అందించిన రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. కేవి గుహన్ కెమెరాపనితనం బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి.
నటీనటుల విషయానికొస్తే..
హర్ష్ రోషన్ రాము పాత్రలో సహజం సిద్దంగా ఒదిగిపోయాడు. టీనేజ్ కుర్రాడిలోని అమాయకత్వం, తెలియని బోళాతనం, అతని పాత్రలో కనిపించింది. కోర్టు తర్వాత మరోసారి తన నటనతో మెప్పిండచాడు. ఆశ పాత్రలో నక్షత్ర నటన బాగుంది. కొన్ని సీన్స్‌లో మంచి నటన కనబరిచింది. అజయ్.. మెడికల్ స్టోర్ మూర్తిగా ఆకట్టుకున్నాడు. హీరో దోస్తు పాత్రలో నటించిన కుర్రాడు తన పరిధి మేరకు మెప్పించాడు. శరణ్య ప్రదీప్ వదిన పాత్రలో ఒదిగిపోయింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించాడు.
పంచ్ లైన్.. యూత్‌కు మెసేజ్ ఇచ్చే.. ‘తెల్ల కాగితం’
రేటింగ్: 2.75/5