ఓటర్ల జాబితా సవరణతో ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కాంగ్రెస్ వాదనలో వాస్తవమెంత..?
SIR Issue: దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విమర్శలకు దారితీసింది. సవరణ ముసుగులో ఓటర్ల పేర్లు గల్లంతవుతున్నాయని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలో నిర్వచన్ సదన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణతో ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎన్నికల సంఘం తప్పేంటి? కాంగ్రెస్ వాదనలో వాస్తవమెంత? జీ న్యూస్ స్పెషల్
Congress Aggitation: దేశంలో ఓటరు జాబితా సమగ్రసవరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ తప్పుబట్టింది. ఉన్న ఓటర్లను ఇష్టారాజ్యంగా తొలగించేస్తున్నారని దుయ్య బట్టింది. ఓటర్ల జాబితా సవరణ ముసుగులో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలో ఎన్నికల సంఘ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్రదర్శన చేపట్టారు. నిర్వచన్ సదన్ వద్ద పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది.
ఓటరు జాబితాలో పేర్లు తొలగింపుపై కాంగ్రెస్ గర్జన..
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగ హక్కులు కాలరాయవద్దని బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఢిల్లీ రోడ్లపై భారీ ప్రదర్శనతో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన కీలక ఆదేశాలు, నిర్ణయాలు ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు తెలియకుండా లేదా వారి సిఫార్సులు లేకుండానే సీఈసీ ఏకపక్షంగా జారీ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫామ్-6 కు అదనంగా ఆన్‌లైన్ డిక్లరేషన్‌ను చేర్చడంపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. దీని ప్రకారం కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పాత ఓటర్ల జాబితా లింక్‌లను సమర్పించాల్సి రావడం ద్వారా లక్షలాది మంది అర్హులైన ఓటర్లు, ముఖ్యంగా మైనారిటీలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్ ప్రక్రియపై ఖర్గే మండిపాటు..
ఓటరు జాబితాలో పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మండి పడ్డారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుండి అన్యాయంగా తొలగిస్తున్నారని, అధికార పక్షానికి లబ్ధి చేకూర్చేలా ఈ ప్రక్రియ సాగుతోందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వంటి నేతలు ఆరోపిస్తూ సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఫారం-6లో చట్ట విరుద్ధమైన మార్పులు చేసి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే సీఈసీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఉపయోగిస్తున్న ఫారం-6లో చేసిన మార్పులను తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు జ్ఞానేశ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనమన్నారు. ప్రధాని మోడీని ఎంతగానో భయపెడుతున్న జెన్ జీ ఓటర్లను తొలగించేందుకే సీఈసీ జ్ఞానేశ్ ఫారం-6ను ఉద్దేశపూర్వకంగా మార్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ దుయ్యబట్టారు.
ఫారం-7తో పేర్లు తొలగిస్తున్నారు - అసదుద్ధీన్ ఒవైసీ..
ఓటరు జాబితా సమగ్ర సవరణలో కుట్రపూరితంగా పేర్లను తొలగిస్తున్నారని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ విచారం వ్యక్తంచేశారు. కొందరు దురుద్దేశంతో ఓటరు జాబితాలోంచి పేర్లను తొలగించాలని ఫామ్ 7 ను ఎన్నికల అధికారులకు అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘ అధికారులు భోగస్ దరఖాస్తులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఓటరు హక్కు కాపాడుతాం - సుదర్శన్ రెడ్డి..
రాజ్యాంగ సంస్థలో వివిధ అంశాలపై అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, వాటిపై న్యాయపరమైన సమీక్ష జరగడం అనేది సంస్థాగతమైన సాధారణ ప్రక్రియే అని స్పష్టం చేసింది. అంతర్గత నోట్స్‌లో అభ్యంతరాలు ఉన్నప్పటికీ, తుది నిర్ణయాలు, ఆదేశాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే తీసుకున్నామన్నారు. వీటికి పూర్తి చట్టబద్ధత ఉందని తేల్చిచెప్పింది. ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడానికేనని ఈసీ పేర్కొంది. మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, ఒకే పేరుతో ఉన్న నకిలీ ఓట్లను తొలగించడంతో పాటు, విదేశీ అక్రమ వలసదారులు ఓటర్ల జాబితాలోకి రాకుండా అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని సమర్థించుకుంది. ఓటరు జాబితాలోంచి పేర్లు తొలగించాలని బోగస్ దరఖాస్తులు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటరు జాబితాలోంచి అనవసరంగా ఎవ్వరి ఓట్లను తొలగించబోమన్నారు.
కాంగ్రెస్ పార్టీది అనవసర రాద్ధాంతం - బీజేపీ ఎదురుదాడి..
ఓటరు జాబితాలోంచి పేరు తొలగించమని ఫామ్ 7 ఇవ్వగానే ఎట్టిపరిస్థితుల్లో తొలగించరని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్థారించుకున్న తర్వాతనే ఓటరు జాబితాల్లోంచి మరణించిన వారిపేర్లను తొలగిస్తారని గుర్తించాలని ఆయన కోరారు.
జ్ఞానేశ్ అబద్ధాలు చెప్పి, చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టమైందన్నారు. మరోవైపు, ఎన్నికల సంఘంతో పాటు అన్ని సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయనడానికి సుప్రీంకోర్టు ఈసీతో పాటు కేంద్రానికి జారీ చేసిన నోటీసులే నిదర్శమని బీజేపీ పేర్కొంది. దేశంలో ఎలాంటి భయ వాతావరణం, నియంతృత్వం లేదని స్పష్టం చేసింది. దేశం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తోంది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. అన్ని వ్యవస్థలు నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయి. మెరుగైన ప్రజాస్వామ్యానికి ఇంతకంటే మరో ఉదాహరణ ఏముంటుంది..? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. దేశంలో ఒక పౌరుడికి ఒకే ఓటు హక్కు అనే నినాదంతో ఎన్నికల సంఘం సంస్కరణలను అమలుచేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. ఓటరు పేరు నమోదు కంటే... దేశవ్యాప్తంగా పౌరులకు ఓటుహక్కు తొలగింపు చాలా క్లిష్లమైన ప్రక్రియ అని అభిప్రాయం వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ, పేర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం అవగాహన కల్పించినప్పటికీ.. రాజకీయ పక్షాలు రాద్దాంతం చేయడం సరికాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సమగ్ర సవరణతో నోటీసులు జారీ చేయడం, పేర్లను తొలగించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందుల్లేవని, పట్టణ, నగర ప్రాంతాల్లో వలసదారుల ఓట్లు మాత్రమే గల్లంతయ్యాయని అధికారులు తెలిపారు.
(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్)