IND Vs PAK Under 19 Asia Cup Final: ఒమన్‌లోని అల్ అమరత్ వేదికగా జరిగిన ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ తుది పోరులో భారత యువ జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి పాకిస్థాన్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఆఖరి బంతికి ఛేదించి, ఉత్కంఠభరితంగా 1 వికెట్ తేడాతో ఛాంపియన్‌గా అవతరించింది. చివరి బంతికి 3 పరుగులు అవసరమైన కీలక తరుణంలో మోహిత్ ఉల్వా బౌండరీ బాది భారత్‌కు చారిత్రక ట్రోఫీని అందించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (111 బంతుల్లో 107) శతకంతో కదం తొక్కగా, అబ్దుల్ ఖాదిర్ (54 బంతుల్లో 80), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (60 బంతుల్లో 63) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ 4 వికెట్లతో మెరవగా, చిగురుపాటి వెంకట 3 వికెట్లు దక్కించుకున్నాడు.
ఆరంభం అదిరినా.. మధ్యలో తడబాటు
కష్టసాధ్యమైన 338 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు లక్ష్య రాజేష్ రాయ్‌చందాని (101 బంతుల్లో 80 పరుగులు), ఆర్యవీర్ సెహ్వాగ్ (61 బంతుల్లో 58) తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన వీకే వినీత్ (24), మనాల్ చౌహాన్ (32 బంతుల్లో 47) పోరాడినా, వరుస విరామాల్లో వికెట్లు పడటంతో భారత్ 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 47.2 ఓవర్లలో 309 పరుగుల వద్ద మనాల్ చౌహాన్ 9వ వికెట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ దాదాపు పాక్ వైపు మొగ్గింది.
చివరి వికెట్‌కు అద్భుత పోరాటం
ఓటమి అంచున ఉన్న జట్టును 11వ నంబర్ బ్యాటర్ చిగురుపాటి వెంకటతో కలిసి మోహిత్ ఉల్వా వీరోచితంగా గెలిపించాడు. మోహిత్ కేవలం 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి అజేయంగా 49 పరుగులు చేయగా, వెంకట 8 బంతుల్లో 11 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి కేవలం 16 బంతుల్లోనే అజేయంగా 30 పరుగులు జోడించారు. ఆఖరి బంతికి 3 పరుగులు అవసరమైన ఉత్కంఠ దశలో మోహిత్ ఫోర్ బాదడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు సాధించి అద్భుత విజయాన్ని అందుకుంది.