New Zealand Beat India By 7 Wickets: స్వదేశీ గడ్డపై భారత్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత న్యూజిల్యాండ్ గొప్పగా పుంజుకుని మిగిలిన ఆఖరి రెండు మ్యాచ్‌లను సొంతం చేసుకుంది. నాలుగో మ్యాచ్ మాదిరి ఐదో మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడి భారత్‌ను ఓడించింది. చివరి మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్ భారీ ఇన్నింగ్స్ నమోదు చేయగా.. గ్లెన్ ఫిలిఫ్స్ మరోసారి సత్తా చాటాడు. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై న్యూజిలాండ్ గెలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. మరోసారి సంజూ శామ్‌సన్ (4) విఫలమవగా.. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 61 పరుగులతో సత్తా చాటగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 50 పరుగులతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న శ్రేయస్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటడం విశేషం. తిలక్ వర్మ ఆరు పరుగులకే వెనుదిరగగా.. నమన్ ధిర్ మరోసారి బ్యాట్‌తో రాణించాడు. 23 బంతుల్లో 33 పరుగులు చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారీ స్కోర్ చేయాలనుకున్న భారత్ లక్ష్యాన్ని కివీస్ బౌలర్లు దెబ్బతీశారు. ఆడమ్ మిల్నే అద్బుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ తలా రెండు వికెట్లు తీశారు.
సిరీస్ కోల్పోయినా చివరి రెండు మ్యాచ్‌లు విజయం సాధించాలనే కసితో ఆఖరి మ్యాచ్‌లోనూ కివీస్ ఆటగాళ్లు పోరాడారు. భారత్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మూడు వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 50 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో దుమ్మురేపగా.. అతడికి గ్లెన్ ఫిలిప్స్ చక్కటి సహకారం అందించి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఫిన్ అలెన్ రెండు పరుగులకే ఔటవగా.. డేరిల్ మిచెల్ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆఖరి మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత్ క్లీన్‌స్వీప్ చేయాలని భావించగా.. న్యూజిల్యాండ్ మాత్రం గొప్పగా పుంజుకుని భారత్‌కు భారీ షాక్ ఇచ్చింది. రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను కివీస్ ముగించింది.