Aryaveer Sehwag: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు అందరినోట ఒకరి పేరు గట్టిగా వినిపిస్తోంది. సెలెక్టర్లు అతడిని తీసుకునేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. అతడే భారత మాజీ సీనియర్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సింగ్ సెహ్వాగ్. తండ్రిలా ఓపెనర్‌గా వచ్చి విధ్వంసం సృష్టించడం. మొదటి బంతి నుంచే బౌండరీలు బాదడం వంటి లక్షణాలు చూస్తే సేమ్ టు సేమ్ సెహ్వాగ్ లాగానే ఇండియా తరపున క్రికెట్లో అద్భుతంగా రాణిస్తాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 యూత్ ఆసియా కప్ 2026లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో 57 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతకుముందు యూఏఈపై 160 పరుగులు, నేపాల్‌పై అజేయంగా 70 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు అతడి ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
అందరినీ దృష్టి ఆకర్షిస్తున్న సెహ్వాగ్ కుమారుడు..
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఇంకా కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అండర్-19 యూత్ ఆసియా కప్ 2026లో వరుసగా భారీ స్కోర్లు నమోదు చేస్తూ తన బ్యాటింగ్ సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆర్యవీర్‌ను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని చర్చ నడుస్తోంది. ఒకవేళ 2027 ఐపీఎల్‌లో గనుక అతడికి అవకాశం లభిస్తే ఏ జట్టు తీసుకుంటుందా అని అందరిలో ఆసక్తి మొదలైంది.
ఐపీఎల్ 2027లోకి రాబోతున్న మరో చిచ్చర పిడుగు ?..
అండర్-19 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆర్యవీర్ సెహ్వాగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీలకమైన మ్యాచులో 57 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో భారత జట్టుకు మంచి ఆరంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ లక్ష్య రైచందానితో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం భారత్‌ను విజయం దిశగా నడిపించింది. సెమీఫైనల్‌కు ముందు యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్ బ్యాట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 160 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు నేపాల్‌పై కూడా అజేయంగా 70 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో తన ఫామ్‌ను చాటుకున్నాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. సెహ్వాగ్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానుల దృష్టి కూడా అతడిపై పడింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడి ఐపీఎల్ ఎంట్రీపై తీవ్రంగా చర్చ నడుస్తోంది.
ఐపీఎల్ మినీ వేలం..
ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ ప్రదర్శన ఆసక్తికరంగా మారింది. అతడి పేరు వేలం జాబితాలో ఉంటే ఏదైనా ఫ్రాంచైజీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుందా లేదా అని ఉత్కంఠ కలిగిస్తోంది. ఒకవేళ ఆర్యవీర్ సెహ్వాగ్ ఐపీఎల్ 2027కు ఎంపిక అయితే మాత్రం ఇక అతడిని ఎవరూ ఆపలేరనే టాక్ వినిపిస్తోంది. అండర్-16 నుంచి అండర్19 దాకా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ఒకవేళ 2027 ఐపీఎల్‌లో అవకాశం వస్తే అక్కడ అద్భుతంగా ఆడి. .ఆ తర్వాత టీమిండియాకు కూడా ఎంపిక అవుతాడని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అతడు మరింతగా రాణించాలంటే ఇదే స్థాయి ప్రదర్శనను కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తండ్రి వారసత్వంతో క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఆర్యవీర్..
వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ మాదిరి క్రికెట్లో రాణించాలని ఎంతో మంది మాజీ సీనియర్ ప్లేయర్ల వారసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారంతా ఇప్పటికి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే దశలోనే మిగిలిపోయారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ దేశవాళీ క్రికెట్‌లో ప్రస్తుతం గోవా తరపున ఆడుతున్నాడు. 2026 ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడాడు. 27 యేళ్ల వయస్సులోనూ ఇంకా తనను తాను నిరూపించుకునే స్థాయిలోనే ఇంకా ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ కుమారులు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్ లు కూడా క్రికెట్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరు దేశవాళీ క్రికెట్ దశలో ఉండాగా, మరొకరు అండర్-19 దశలో ఉన్నారు. ఇద్దరు కూడా తండ్రి రాహుల్ ద్రవిడ్ మాదిరిగానే నిదానంగా, టెక్నిక్ షాట్లు ఆడేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వారిపై సెలెక్టర్లు అంతగా శ్రద్ధ కనపరచడం లేదని టాక్ నడుస్తోంది.
అండర్-19 ఆసియా కప్‌లో వరుసగా రికార్డులు నమోదు..
అర్జున్ టెండూల్కర్ బౌలర్‌గా నిరూపించుకునేందుకు ఐదేళ్లుగా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్ తుది జట్టులో చోటు లభిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాడు. అంతే కాకుండా సమిత్ ద్రవిడ్ కూడా గాయాల కారణంగా అండర్-19 సిరీస్ అవకాశాలను కోల్పోయి ప్రస్తుతం రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ మాత్రం తండ్రిలానే మొదటి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి అతడి పైనే కనపడుతోంది. ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్‌లో కొనసాగిస్తున్న ఫామ్‌ను అలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా 2027 ఐపీఎల్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్‌కు చోటు దక్కుతుందనే చర్చ నడుస్తోంది.