Who Is Mohit Ulva: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. పాకిస్థాన్‌పై ఓటమి ఖాయం అనుకున్న దశలో అద్భుతంగా పోరాడి.. భారత్ సంచలన విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 18 ఏళ్ల కుర్రాడు మోహిత్ ఉల్వా చివరి బాల్‌కు బౌండరీ బాది గెలిపించాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. ఓటమి అంచున ఉన్న జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ యువ ఆటగాడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అసలు ఎవరీ మోహిత్ ఉల్వా..? అతడి క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది..? ఇక్కడ తెలుసుకుందాం..
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఆసియా కప్ ఫైనల్ అయితే ఆ ఉత్కంఠ మరో స్థాయిలో ఉంటుంది. అలాంటి కీలక పోరులో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు యువ క్రికెటర్ మోహిత్ ఉల్వా. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడి పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఒమన్‌లోని అల్ అమేరత్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో రాణించగా.. అబ్దుల్ ఖాదిర్ 80, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో మంచి భాగస్వామ్యాలు లభించినా.. మధ్యలో వరుస వికెట్లు పడ్డాయి. ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. మరో రెండు వికెట్లు తీస్తే పాక్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. టీమిండియా ఫ్యాన్స్ కూడా భారత్ ఓడిపోతుందని టీవీలు ఆఫ్ చేసేశారు.
అయితే క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన మోహిత్ ఉల్వా మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మనల్ చౌహాన్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మనల్ 47 పరుగులు చేసి వెనుదిరిగినా.. చిగురుపాటి వెంకటతో కలిసి మోహిత్ పోరాటాన్ని కొనసాగించాడు. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. పాక్ బౌలర్ అహ్మద్ హుస్సేన్ వేసిన ఆ బంతిని మోహిత్ లాంగ్ ఆఫ్ దిశగా బౌండరీకి తరలించాడు. దీంతో భారత్ ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మోహిత్ 26 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఎవరీ మోహిత్ ఉల్వా..?
మోహిత్ ఉల్వా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 18 ఏళ్ల యువ క్రికెటర్. చిన్న వయసు నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న ఈ కుర్రాడు.. క్రికెట్ బంగ్లా అకాడమీలో కోచ్ మహేంద్రసింగ్ చౌహాన్ వద్ద శిక్షణ పొందాడు. ఈ అకాడమీ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా రావడం విశేషం. భారత్ అండర్-19 జట్టులో ఇప్పటికే చోటు సంపాదించిన మోహిత్.. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. 2026లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్టులో అరంగేట్రం చేసి.. తొలి మ్యాచ్‌లోనే 92 పరుగులు సాధించాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే పాక్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ పోరు మోహిత్ కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. టాప్ ఆర్డర్ ప్లేయర్ కాకపోయినా.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ చివరి వరకు క్రీజ్‌లో నిలిచి దేశానికి ట్రోఫీ అందించాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో మోహిత్ ఉల్వా పేరు క్రికెట్ అభిమానుల్లో మార్మోగేలా చేశాడు.
WHAT A FINISH! 🇮🇳🔥 Our young Team India has turned a thrilling final into a moment to remember, beating Pakistan to become the Men's U19 Asia Cup champions! Congratulations, boys! You've made the nation proud. 👏 https://t.co/ezEnYkcwbR
— Smriti Z Irani (@smritiirani) November 14, 2026