Radial Roads 2 Tender Scam Allegations: తెలంగాణ ప్రభుత్వంలో మరో భారీ కుంభకోణం జరిగిందని.. రూ.3,296 కోట్ల కుంభకోణం జరిగితే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రూ.3,296 కోట్ల రేడియల్ రోడ్-2 టెండర్లలో కుంభకోణం అని ఆరోపించారు. నచ్చినవారికే కాంట్రాక్టులు.. తక్కువ ధరకు బిడ్లు వేసినవారిని పక్కన పెట్టారని విమర్శించారు. వందల కోట్ల ప్రజాధనానికి నష్టం జరిగేలా వ్యవహారం.. టెండర్లను రద్దు చేసి విచారణ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
రూ.3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రేడియల్ రోడ్-2 టెండర్ల వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ కోరారు. బుద్వేల్ నుంచి కొడంగల్ సమీపంలోని జాతీయ రహదారి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి చేపట్టిన టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయని, పనులను ప్యాకేజీలుగా విభజించి, ముందుగా నిర్ణయించుకున్న సంస్థలకే కట్టబెట్టారనే అనుమానాలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. తక్కువ ధరకు బిడ్లు వేసిన సంస్థలను పక్కనపెట్టి, ఎక్కువ ధరలకు కోట్ చేసిన సంస్థలకు పనులు కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఐదు పని దినాల్లోనే రూ.3,296 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన 13 బిడ్ల పరిశీలన, అర్హతల నిర్ధారణ, కేటాయింపుల ప్రక్రియ ఎలా పూర్తిచేశారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి సంస్థ సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారా? నిర్ణయాలకు అవసరమైన ఆధారాలను నమోదు చేశారా? అనేది వెల్లడించాలని కోరారు. ప్రతి ప్యాకేజీకి ఎన్ని సంస్థలు బిడ్లు వేశాయి? ఎన్ని అర్హత సాధించాయి? ఏ సంస్థ ఎంత ధర కోట్ చేసింది? అంచనా వ్యయంతో పోలిస్తే తుది కేటాయింపు ఎంత ఎక్కువగా ఉంది? అనే వివరాలను బహిర్గతం చేయాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ధరల వ్యత్యాసాలు, అంచనా వ్యయాలు, ఆర్థిక బిడ్లు, తుది కేటాయింపులను పోల్చి ప్రజాధనానికి నష్టం జరిగిందా లేదా అనేది తేల్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భారీ టెండర్లలో తమను దూరంగా ఉంచుతున్నారని, అనుకూలంగా లేని బిడ్డర్లను సాంకేతిక కారణాలతో అనర్హత వేటు వేస్తున్నారని తెలంగాణ కాంట్రాక్టర్లు చేస్తున్న ఆరోపణలపై అధికారిక విచారణ చేసి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. రెండు రేడియల్ రోడ్లకు సంబంధించిన అంచనా వ్యయాలు, బిడ్ల ధరలు, సంస్థల అర్హతలు, తుది కేటాయింపుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజాధనంతో చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో పారదర్శకత ప్రభుత్వ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ డిమాండ్లు ఇవే
==> రేడియల్ రోడ్-2 టెండర్లను వెంటనే రద్దు చేసి, ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలి.
==> మూడు ప్యాకేజీల అంచనా వ్యయాలు, తుది కేటాయింపు విలువలు, అర్హత సాధించిన బిడ్డర్ల ఆర్థిక బిడ్ వివరాలను విడుదల చేయాలి
==> బిడ్ ఓపెనింగ్ స్టేట్‌మెంట్లు, కంపారేటివ్ స్టేట్‌మెంట్లు, మూల్యాంకన కమిటీ సమావేశాల మినిట్స్, సాంకేతిక మూల్యాంకన నివేదికలను బహిర్గతం చేయాలి
==> రూ.600 కోట్ల నష్టం జరిగిందనే ఆరోపణపై పూర్తి స్థాయి విచారణ చేసి వాస్తవాలు వెల్లడించాలి
==> మూడేళ్లలో హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్ చేపట్టిన రూ.100 కోట్లకు పైగా కాంట్రాక్టులపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి
==> రెండు రేడియల్ రోడ్ల టెండర్లకు సంబంధించి బిడ్డర్లు, అనర్హతలు, ధరలు, తుది కేటాయింపులు, కాంట్రాక్టులు పొందిన సంస్థల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి
==> సాంకేతిక అర్హతల నిర్ధారణ, బిడ్డర్లకు వివరణ ఇచ్చే అవకాశం, ఆర్థిక బిడ్ల పరిశీలన వంటి అంశాల్లో పారదర్శకతకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి
సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా దాని వెనక భారీ స్కాం ఉంటుందని మరోసారి తేలిపోయింది. బుద్వేల్ నుంచి కొడంగల్ కు తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణంలో జరిగిన కుంభకోణమే దీనికి సజీవ సాక్ష్యం. ఈ రేడియల్ రోడ్ల టెండర్లలో జరిగిన భారీ కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రూ.3296 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల టెండర్లలో అవకతవకల నేపథ్యంలో వెంటనే వాటిని రద్దుచేయాలి. రాష్ట్ర ఖజానాకు ఏకంగా 600 కోట్ల నష్టం వాటిల్లినా, ఎందుకు వారికే టెండర్లు కట్టబెట్టారో సమాధానం చెప్పే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా ?? ఆరు రోజుల వ్యవధిలో ఆగమేఘాల మీద టెండర్లు కట్టబెట్టడం వెనక మతలబేంటో బయటపెట్టాలి. అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎందుకు పక్కనబెట్టారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. రెండు సంస్థలు అంచనా వ్యయం కంటే ఎక్కువగా కోట్ చేసినప్పటికీ, ఆ వివరాలను గోప్యంగా ఉంచడం వెనక మతలబేంటి ?? అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చిందెవరో..?? టెండర్లు అక్రమంగా కట్టబెట్టిందెవరో ?? తేలాలంటే సమగ్ర విచారణ జరపాల్సిందే. ఒక్కో ప్యాకేజీకి, ఒక్కో రకమైన నిబంధనలు పెట్టడం చూస్తుంటేనే.. ఈ కుంభకోణానికి పైస్థాయిలోనే స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. ఒక ప్యాకేజీలో అర్హత పొందిన సంస్థను మరో ప్యాకేజీలో అర్హత లేదని పక్కనపెట్టడంతోనే ఇందులోని గూడుపుఠాణి అర్థమైపోతోంది. టెండర్లలో పోటీలేకుండా చేసి పనులు అప్పగించడం ముమ్మాటికీ ముందస్తు లోపాయికారి ఒప్పందంలో భాగమే. రేడియల్ రోడ్ల పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జై తెలంగాణ
— KTR (@KTRBRS) October 10, 2026