Government School Development: ప్రభుత్వ బడి అంటే మౌలిక వసతుల లేమి. విద్యార్థుల కొరత. ఈ నానుడిని పటాపంచలు చేశారు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని రీతిలో డిజిటల్ విద్యను.. కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెబ్బెన మండలం, ఎంపీపీఎస్ రెబ్బెన ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లావణ్య.. తన అంకితభావంతో సర్కారీ బడి స్వరూపాన్నే మార్చివేశారు.
2010 నవంబర్ 4న ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన లావణ్య.. గత 16 సంవత్సరాలుగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రిత కార్యక్రమాలు, సామాజిక భాగస్వామ్యంతో పాఠశాల పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సొంత నిధులతో బడికి కార్పొరేట్ సొగసులు:
పాఠశాల సమగ్ర అభివృద్ధి కోసం ఆమె తన సొంత నిధుల నుంచి సుమారు రూ. 1 లక్ష వరకు వెచ్చించడం విశేషం. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చుని చదువుకోవడానికి ప్రతి ఒక్కరికీ కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు, ఎలక్ట్రిసిటీ సామగ్రిని సమకూర్చారు. పాఠశాల భవనానికి రంగులు వేయించడం, ప్రహరీ గోడ నిర్మాణం, ఇనుప గేటు, వరండాకు గ్రిల్స్ అమరిక వంటి పనులను స్వయంగా చేపట్టారు. మధ్యాహ్న భోజనం కోసం శుభ్రమైన ప్లేట్లు, గ్లాసులు, పాత్రలతో పాటు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్నులు, డైరీలు, స్టేషనరీ, గ్రంథాలయ పుస్తకాలను సొంత ఖర్చులతో అందజేశారు.
21 నుంచి 53కి పెరిగిన ఎన్‌రోల్మెంట్:
ఆమె బాధ్యతలు స్వీకరించే నాటికి పాఠశాలలో కేవలం 21 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ యువత, ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటూ గ్రామంలో విస్తృత అవగాహన కల్పించారు. ఫలితంగా ప్రస్తుతం పాఠశాల ఎన్‌రోల్మెంట్ 53కి పెరిగింది. ఆమె సరైన మార్గదర్శకత్వంలో ఇద్దరు విద్యార్థులు ప్రతిష్టాత్మక గురుకుల పాఠశాలలకు ఎంపిక కావడం విశేషం.
ప్రీ-ప్రైమరీ, ఆంగ్ల మాధ్యమ విప్లవం:
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా 2025–26 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2025లో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) తరగతులను ప్రారంభించి.. చిన్నతనం నుంచే నాణ్యమైన విద్యకు బలమైన పునాది వేశారు. ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం స్వతహాగా ఒక వాలంటీర్‌ను నియమించుకుని.. ఆమెకు సొంత నిధుల నుంచే గౌరవ వేతనం చెల్లిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బోధన, ప్రత్యేక శ్రద్ధ:
సాంకేతికతను విద్యకు అనుసంధానిస్తూ... 3, 4, 5 తరగతుల విద్యార్థులలో తెలుగు, ఆంగ్లము, గణితం సబ్జెక్టులలో వెనుకబడిన వారి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా బోధనకు శ్రీకారం చుట్టారు. అభ్యసన సామర్థ్యాలలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిలో కనీస సామర్థ్యాలను పెంపొందిస్తున్నారు.
నో బ్యాగ్ డే, పర్యావరణ పరిరక్షణ:
విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రతి మూడవ శనివారం "నో బ్యాగ్ డే" కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో అనుసంధానించేందుకు కాళేశ్వరం, జోడేఘాట్ వంటి పవిత్ర, చారిత్రక ప్రాంతాలకు క్షేత్ర పర్యటనలు (Field Trips) ఏర్పాటు చేస్తున్నారు.
పాఠశాలను 'జీరో-వేస్ట్'.. 'నో-ప్లాస్టిక్ జోన్'గా నిర్వహిస్తూ పిల్లల్లో చిన్నతనం నుంచే పరిశుభ్రత, పర్యావరణ బాధ్యతను పెంపొందిస్తున్నారు. నిరంతరం తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడమే కాక, బడికి గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని బడికి వచ్చేలా మోటివేట్ చేస్తున్నారు. తన వినూత్న ఆలోచనలు, నిరంతర శ్రమ, సామాజిక బాధ్యతతో ప్రభుత్వ పాఠశాల స్థాయిని పెంచిన అడ్లూరి లావణ్య తోటి ఉపాధ్యాయ లోకానికి ఒక ఉజ్వల ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: