SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Harish Rao: మేడిగడ్డ మాదిరి మల్లన్నసాగర్‌ను పేల్చివేస్తారా? హరీశ్‌ రావు

Harish Rao Serious Allegations On Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను కూల్చినట్లు.. మల్లన్నసాగర్‌ను కూడా పేల్చివేస్తారా? అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. పైపులైన్ల కోసం అనధికారికంగా బ్లాస్టింగ్స్ చేస్తుండడంతో మల్లన్న సాగర్ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 29, 2026, 03:27 PM IST | Updated: Oct 29, 2026, 05:00 PM IST
Image Credit: Harish Rao Mallanna Sagar
Join

Mallannasagar Blasts: తెలంగాణలో మరో ప్రాజెక్టును కూల్చాలని కుట్ర చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు. మల్లన్నసాగర్ కూల్చాలని కుట్ర చేస్తున్నారా? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కట్టపక్కనే అనధికారికంగా బ్లాస్టింగ్ ఎలా చేస్తారు? అని నిలదీశారు. మేడిగడ్డ చేసినట్లు ఈ ప్రాజెక్టును చేయాలని చేస్తున్నారా? అని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టను, అక్రమ బ్లాస్టింగ్స్ జరిగిన ప్రాంతాన్ని గురువారం బీఆర్‌ఎస్ పార్టీ బృందం పరిశీలించింది. తిప్పారం వద్ద పైప్‌లైన్ల కోసం అనధికారికంగా పేలుళ్లు చేస్తుండడంతో మల్లన్న సాగర్ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బక్కి వెంకటయ్య పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ లేదు, పోలీసుల పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా కట్టకు 100 మీటర్ల లోపలే బ్లాస్టింగ్ చేస్తున్నారు. బ్లాస్టింగ్‌తో కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలోని ఇండ్లకు పగుళ్లు వచ్చాయి. బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 'మల్లన్న సాగర్‌ను కూల్చేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కట్టకు 150 మీటర్లలోనే అర్ధరాత్రి వేళ అక్రమ పేలుళ్లు. మూసీ సుందరీకరణ నీళ్ల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా మల్లన్న సాగర్ కట్ట సమీపంలోనే 20 మీటర్ల లోతున అడ్డగోలు బ్లాస్టింగ్స్ చేస్తుండటంతో అదురుతున్న రిజర్వాయర్ కట్ట, పెరుగుతున్న సీపేజీ. కట్టకు 400 మీటర్ల లోపు ఎలాంటి పేలుళ్లు జరపకూడదన్న ఇరిగేషన్ నిబంధనలను తుంగలో తొక్కి, కేవలం 150 మీటర్ల దూరంలోనే భారీ బ్లాస్టింగ్స్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు నిలదీశారు. 'కాంగ్రెస్ అంటేనే దొంగల ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు కొనసాగుతున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. మల్లన్నసాగర్ కట్ట కూడా బీటలు వారింది, ఇండ్లు కూడా దెబ్బతింటున్నాయి' అని ఆందోళన వ్యక్తం చేశారు.

'బ్లాస్టింగ్ ధాటికి కిలోమీటర్ దూరంలోని తిప్పారం గ్రామంలో నెర్రెలుబారిన ఇళ్లు. పనులు ఆపాలని ఇరిగేషన్ అధికారులు లేఖ రాసినా జలమండలి అధికారులు బేఖాతరు చేశారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, సీపీ, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరికీ పర్మిషన్ ఇచ్చినట్టు తెలియదంటున్నారు. మరి అర్ధరాత్రి వేళ ఈ దొంగ బ్లాస్టింగ్స్ ఎవరి అండతో జరుగుతున్నాయి?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ప్రశ్నించారు. 'భూసేకరణలోనూ దళిత అసైన్డ్ రైతులకు ద్రోహం. కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో రైతులను బెదిరించి రూ. 10 లక్షలే ఇచ్చారు, 2013 చట్టం ప్రకారం ఎకరాకు కనీసం రూ. 20 లక్షలు ఇవ్వాల్సిందే' అని డిమాండ్‌ చేశారు. తక్షణమే అక్రమ బ్లాస్టింగ్స్ ఆపి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. ఏజెన్సీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రకటించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES