KTR vs Revanth Reddy: పంటలు, ఫీజురీయింబర్స్‌మెంట్, నిర్మాణాలు, విద్యుత్ ఇలా అన్నింటికీ హలీడే ప్రకటించే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు హలీడే ప్రకటిస్తే పీడ పోతుందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మార్పు మార్పు అంటే ట్యాంకర్లతో నీళ్లు పారించే పరిస్థితి, పంటలు తగలబెట్టుకునే పరిస్థితులు తెచ్చారని రైతుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, ఇప్పుడు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి కేటీఆర్ ఎత్తిచూపారు.
'మీ ట్యాంకర్లు మీరే తెచ్చుకోండి, మీ పంటను మీరే కాపాడుకోండి అని సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకుంటున్నారు. పొలానికి నీళ్లు లేక ట్యాంకర్‌తో నీళ్లు పోసుకుంటే ఒక రైతుని సస్పెండ్ చేశారు. సింగరేణిలో మీ కుంభకోణాల వల్లే పవర్ హాలిడే దుస్థితి వచ్చింది. క్రాప్ హాలిడే, కన్స్ట్రక్షన్ హాలిడే, పవర్ హాలిడే, ఫీజు రీయింబర్స్‌మెంట్ హాలిడే, 420 హామీలకు హాలిడే. ఇక ప్రభుత్వానికే హాలిడే ఇస్తే పీడ పోతది కదా' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
'రైతులు తమ పొలాలు తగలపెట్టుకోవడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, కన్స్ట్రక్షన్ హాలిడే, 420 హామీలకు హాలిడే. అన్నిటికి హాలిడే ఇస్తున్న ఈ ప్రభుత్వానికి హాలిడే ఇవ్వాలి' అని తెలంగాణ ప్రజలకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. రేవంత్ రెడ్డి మన నెత్తిన రుద్దిన కరువు అని పునరుద్ఘాటించారు. 4 నెలల నుంచి తాము చెబితే రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తలేదని గుర్తుచేశారు. 'గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 250 టీఎంసీల నీళ్లు కిందకి వదిలారు.. ఆ నీళ్లు చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కరువు లేదు.. తెలంగాణలో ఉంది' అని తెలిపారు. 365 కరువు మండలాలు ఉండటానికి కారణం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లో, కర్ణాటకలో మన దగ్గరికంటే తక్కువ వర్షాలు పడ్డ కరువు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం వర్షపాతం లోటు ఉంది.. కర్ణాటకలో 30 శాతం ఉంది. రేవంత్ రెడ్డి తాను తెచ్చిన కరువు గురించి ప్రకటనలు గుప్పిస్తున్నాడు' అని తెలిపారు. 'కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఏంటి? ఎవరి కోసం, దేని కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు? పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? ఈ మూడేళ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన ఎంఓయూలు, సమ్మిట్‌ల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అసలు పెట్టుబడులు వచ్చాయా? లేకపోతే వాటి ముసుగులో అనుముల అన్నదమ్ములు భూదందా నడిపారా? అని ప్రశ్నించారు.
'రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వం కరువు ఉందని చెబుతూనే మరోవైపు మూసీ సుందరీకరణ చేస్తాడట! మూసీ ప్రాజెక్ట్ బాధితుల కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజలు, బాధితులు లేకుండా, ప్రజల గొంతును నొక్కుతూ పబ్లిక్ హియరింగ్ ఎలా నిర్వహిస్తారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? అనుముల రేవంత్ రాజ్యాంగం ఉందా?' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.