SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Harish Rao: చేతులెత్తేసిన చేతగాని సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు: హరీశ్‌ రావు

Harish Rao Slams To Revanth Reddy: ఎల్‌నినో.. కరువుపై బీఆర్‌ఎస్‌ పార్టీని తీవ్ర విమర్శలు చేసిన రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. చేతగాని సీఎంగా రేవంత్‌ రెడ్డి చరిత్రలో మిగిలపోతాడని తెలిపారు. అసమర్థుడికి అధికారం అప్పగిస్తే.. ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా ఉందని రేవంత్ రెడ్డి పాలనను ఎద్దేవా చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 23, 2026, 10:24 PM IST | Updated: Oct 23, 2026, 10:35 PM IST
Image Credit: Harish Rao vs Revanth Reddy
Join

Telangana Politics: ఎల్‌నినో.. కరువు పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అసమర్థుడికి అధికారం అప్పగిస్తే.. ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా రేవంత్ రెడ్డి పాలన ఉందని ఎద్దేవా చేశారు. కరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడని పేర్కొన్నారు. రంకెలు వేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ చేతగానితనంతో వచ్చిన కరువే అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ప్రకటించారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేనని ఎద్దేవా చేశారు. 'రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి భయభ్రాంతులకు గురిచేస్తావా రేవంత్ రెడ్డి? కరువు వస్తోంది.. నేనేం చేయలేనని చేతులెత్తేసేవాడా పాలకుడు? తాగునీళ్లు కూడా ఉండవని భయపెట్టడానికేనా రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఉన్నది? ప్రజలను కాపాడేందుకు ఎంతకైనా సిద్ధమనేవాడే కదా నిజమైన పాలకుడు? ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉంటే.. రేవంత్‌లాగా పనికిమాలిన, చేతగాని మాటలు చెప్పేవారా?' అని రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు.

వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఒడిసిపట్టి.. తెలంగాణకు కరువు రాకుండా కేసీఆర్ చూసేవారని.. ముందస్తు చర్యలు తీసుకొని కరెంటు కోతలు నివారించేవారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఎల్‌నినో గురించి ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామంటూ.. కరువు నివారణకు తీసుకున్న ముందస్తు చర్యలేంటో చెప్పగలరా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. కరువు ప్రకృతి సృష్టి కావచ్చు.. కానీ కరువును ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించడం, ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని నిలదీశారు.

'ప్రజలను భయపెట్టడం కాదు.. భరోసా ఇవ్వాలి. నీటి నిల్వలు, విద్యుత్, ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై మీ కార్యాచరణ ఏంటి? కరువు వస్తుందని ఆరు నెలలుగా తెలుసని చెబుతున్నారు.. మరి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోలేదు? ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎందుకు పెంచుకోలేదు? బొగ్గు నిల్వలు లేవు, కరెంట్ సంక్షోభం వస్తుందని మేం మొత్తుకుంటుంటే.. ఎందుకు ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారు? ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు మీ చేతగానితనం కారణం కాదా? ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎల్‌నినో ప్రపంచవ్యాప్త సమస్య అయితే.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు కరువు లేదు? అక్కడ ఎందుకు నీటి గలగలలు.. ఇక్కడ ఎందుకు రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి?' అని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

'కరువు పేరుతో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేమని ముందే చేతులెత్తేయడం పాలనా దక్షత కాదు.. రైతులను సంక్షోభంలోకి నెట్టడమే. 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగాన్ని గొప్పగా చెబుతున్నారు. అదే సమయంలో విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటున్న రైతుల గోస కనిపించడం లేదా?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు నిలదీశారు. బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దాన్ని కూడా తన ఘనతగా చెప్పుకునే భావదారిద్ర్యం రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి కరువు నుండి ప్రజలను కాపాడతారా ప్రజలు ఆలోచించాలని సూచించారు.

'ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే రాజకీయ విమర్శలు.. ఇదేనా మీ ప్రజాపాలన? కరోనా సమయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలపై మాట్లాడే ముందు.. నేటి కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 'కరువు నివారణకు చర్యలు తీసుకోలేని రేవంత్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎక్కడిది? రాజకీయాల కోసం పుట్టిన గడ్డనే కరువు రక్కసికి బలిపెట్టిన ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి రేవంత్ కాదా? ఇంతా చేసి సిగ్గులేకుండా బుకాయింపు మాటలతో ఎవరిని మోసం చేస్తావ్ రేవంత్ రెడ్డి' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం కాదు.. ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని ఇకనైనా గుర్తించాలని రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES