Hyderabad Honeytrap Case: అందమైన అమ్మాయి ప్రొఫైల్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందంటే చాలు.. ఎగేసుకుని వాలిపోతారు. అవతలి వైపు ఉంది నిజంగా అమ్మాయేనా.. ఇది తన ఒరిజినల్ అకౌంటేనా.. అనే వివరాలు అస్సలు పట్టించుకోరు. ఆడపిల్ల పేరు కనిపిస్తే చాలు.. మత్తు ఆవహించేస్తుంది. ముందుగా తియ్యని మాటలు.. ఆ తర్వాత అసభ్యకర చాటింగ్.. నగ్న వీడియోలతో వేల వేసి బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేస్తారు.. తాజాగా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా సాగిన ఒక సంచలన హనీట్రాప్ రాకెట్ గుట్టును హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్‌తో అమాయకులను.. ముఖ్యంగా పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ప్రధాన సూత్రధారి కొండబత్తుల పవన్‌కుమార్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
వలపు వల.. మార్ఫింగ్ బెదిరింపులు:
నిందితుడు పవన్ తన మాజీ ప్రియురాలితో కలిసి ఈ నేర సామ్రాజ్యాన్ని నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 33, ఫేస్‌బుక్‌లో 14 నకిలీ ఖాతాలను క్రియేట్ చేశాడు. యువతుల అందమైన ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్‌లుగా పెట్టాడు. ప్రత్యేకంగా పోలీసు అధికారులకే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించాడు. వారితో శృంగార సంభాషణలు నడిపేవాడు. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో బాధితుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసేవాడు. వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసేవాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించేవాడు. శాఖాపరమైన ఫిర్యాదులు చేసి ఉద్యోగాలు ఊడగొడతామని బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. చాట్ చేస్తున్నది అమ్మాయి కాదని ముందే తెలిసినా.. కొందరు అధికారులు భయంతో అతడితో నిరంతరం చాటింగ్ కొనసాగించడం గమనార్హం.
డీఐ బాలస్వామి ఉదంతం:
ఈ హనీట్రాప్ ఉచ్చులో ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) బాలస్వామి పూర్తిగా చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చందన అనే ఫేక్ పేరుతో ఖాతా తెరిచిన పవన్.. ఆమె తన బంధువని, డీఐకి ఇచ్చి వివాహం చేస్తానని నమ్మించాడు. అసలు అలాంటి వ్యక్తీయే లేనప్పటికీ.. ఆమెకు తీవ్ర అనారోగ్యం ఉందని నమ్మించి వైద్య ఖర్చుల పేరుతో ఏకంగా రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు గుంజాడు. అంతేకాకుండా, బాలస్వామిని కుటుంబానికి దూరంగా దాదాపు ఆరు నెలల పాటు ఒక లాడ్జిలోనే ఉంచి మానసికంగా వేధించాడు. ఇంటికి వెళితే అక్రమ కేసులు పెట్టిస్తానని బెదిరించాడు. చివరికి బాధితుడి భార్య గంజి హరిత పోలీసులను ఆశ్రయించడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. డీఐ బాలస్వామి కూడా ఈ వివాదానికి సంబంధించి రిమాండ్‌లో ఉన్నారు.
అంతర్జాతీయంగా విస్తరించిన నెట్‌వర్క్:
నిందితుడు పవన్ మోసాలకు బలైన వారి సంఖ్య వెయ్యి దాటినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లోనూ బాధితులు ఉన్నారు. ఈ దందా దేశ సరిహద్దులు దాటి యూఏఈ, ఒమన్, పాకిస్థాన్, కెన్యా దేశాల వరకు విస్తరించడం విశేషం. మొత్తం బాధితుల్లో ఏకంగా 82 మంది పోలీసు అధికారులే ఉండటం కలకలం రేపింది. నిందితుడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ నేరంలో పవన్‌కు సహకరించిన కవితతో పాటు ఇతర సభ్యుల కోసం గాలింపును తీవ్రతరం చేశారు.
పోలీసులు నిందితుడు పవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ కాల్ డేటా, చాట్ రికార్డులను పరిశీలించగా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులలో 2 అదనపు డీసీపీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. స్వలింగ సంపర్కుడని తెలిసి కూడా, ఒక ఎస్ఐ అతనితో చాట్ చేయడం, నిందితుడితో సంబంధాన్ని కొనసాగించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పోలీసు అధికారుల పేర్లు, వారి చాట్‌లకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. సైదాబాద్ పోలీసులు ఈ అంశంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: