KTR Speech: 'కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ షురూ.. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్
KT Rama Rao Announces Countdown Starts For Congress: అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని.. ఇంకా 500 రోజులు ఆగితే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. వరంగల్ గడ్డపై రేవంత్ రెడ్డిపై, వైఫల్య కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం, విమర్శలు చేశారు.
Warangal BRS Party Meeting: ప్రజలు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి కనిపిస్తున్న సమస్య అంతా ఒకటే నా గడ్డమే. నా గడ్డంపై వ్యాఖ్యలు చేయడం మినహా రాష్ట్ర సమస్యలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం లేదు' అని తెలిపారు. కరువు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై పట్టింపు లేని రేవంత్ రెడ్డికి.. బూతులు మాట్లాడటం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. పెన్షన్లు పెంచకపోగా 4.71 లక్షల మందికి కోత పెట్టడం ఇదేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500 హామీ ఏమైంది? అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. 2028లో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'పెన్షన్లు పెంచామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు మాట్లాడాలని, 4.71 లక్షల పింఛన్లు తొలగించి కొత్తగా 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తే అది పెంచినట్లా.. తగ్గించినట్లా అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలేదని.. ఒక్కో మహిళకు రూ.85,500 బకాయి పడ్డారని తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అవినీతి, 20 శాతం కమీషన్ల వ్యవహారాన్ని బయటపెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా పర్సంటేజీల పాలన సాగుతోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ అభివృద్ధిని కాంగ్రెస్ మూడేళ్లుగా అటకెక్కించిందని.. కేసీఆర్ హయాంలో ఆరు మెడికల్ కాలేజీలు.. ఐటీ, టెక్స్‌టైల్ పరిశ్రమలు వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్నా అని అభివర్ణించారు.
'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2,000 పెన్షన్‌ను ఇప్పటికీ కొనసాగిస్తూ.. కొత్తగా పెన్షన్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది' అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కనీసం లక్షాధికారులుగా చేయాలని సవాల్ విసిరారు.
మహిళలకు రూ.1.50 లక్షల చొప్పున ఇచ్చి లక్షాధికారులను చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్తానని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం వంటి హామీలను కూడా కాంగ్రెస్ విస్మరించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి, మంత్రి కుటుంబాలకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చెబుతుంటే.. 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు జరగడం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెబుతున్నారు' అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తుచేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ.వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు, దేవాలయ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నాయని వెల్లడించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కమీషన్ల వసూళ్లలో మునిగిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం 1,200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే అధిష్ఠానాల మెప్పే వారికి ముఖ్యమైందని పేర్కొన్నారు.