KTR Hotels: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివాదంపై మరోసారి సిరిసిల్ల వేదికగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయగా వాటికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో బదులుఇచ్చారు. ఇక అంతేకాకుండా తన హోటళ్ల వ్యాపారంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనకు హోటళ్లు ఉన్నాయనేది నిజం అంటూ.. అమెరికా నుంచి సంపాదించిన సొమ్ముతో పెట్టానని తెలిపారు. అది ఇప్పుడు మూడు హోటళ్లు అయ్యాయని.. తన హోటళ్లకు ఉచితంగా ప్రమోషన్ చేసినందుకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం చేరికలు జరిగాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా.. వారిని స్వాగతించిన అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డి నాకు హోటల్ ఉంది అంటున్నాడు.. నేనే చెప్పినదాన్ని నువ్వు చెప్పేదేంది? కొలంబస్‌లాగా! వాస్కోడిగామా కనుక్కున్నట్లు నువ్వు కొత్తగా కనుక్కున్నదేంది?' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ తేలికగా తీసిపడేశారు.
'ఆస్తుల్లో రేవంత్ రెడ్డి అదానీని దాటిపోయేలా ఉన్నాడు. అందర్నీ తొక్కుకుంటూ వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యి మూడేళ్లయింది.. ఇంకా ఫ్రస్ట్రేషన్‌లోనే ఉన్నాడు. ఆయన అన్నదమ్ముల దోపిడిని బయటపెట్టినందుకు ఆయనకు కోపం వచ్చింది. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు ఏరోస్పేస్ కంపెనీ పెట్టాడు. అమెరికాలో ఉండే రేవంత్ రెడ్డి వాళ్ల అన్న రూ.1000 కోట్లు పెట్టుబడి పెడతా అని వచ్చి రేవంత్ రెడ్డితోనే ఒప్పందం చేసుకున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
'2006లోనే నేను హోటల్ పెట్టా. నాకు హోటల్ ఉందని 2009లోనే ఎన్నికల అఫిడవిట్‌లో పెట్టా. రేవంత్ రెడ్డి అందులో కొత్తగా కనుకున్నది ఏమీలేదు. నా హోటళ్లకు పబ్లిసిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. అది ఇప్పుడు మూడు హాటళ్లు అయ్యింది. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఆ విషయం ప్రస్తావించా. వ్యాపారం చేయడం తప్పా.?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా.? అని సవాల్ చేశారు. 'సుప్రీంకోర్టు జడ్జీకి లేఖ రాయండి. తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్ధం' కేటీఆర్ ప్రకటించారు.
'కాంగ్రెస్ వచ్చాక సిరిసిల్లలో 35 మంది చేనేత కార్మికులు చనిపోయారు. నిన్న వాళ్ల గురించి సీఎం ఏమైనా చెబుతారని అనుకున్నాం. రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తారని అనుకున్నాం. వాటి గురించి ఏం చెప్పలేదు. శత్రుదేశంపై దాడికి వెళ్లినట్లు వెళ్లారు. కాంగ్రెస్ వచ్చి మూడేళ్లు అవుతుంది, ఏం తేల్చారు. మేం ప్రశ్నిస్తున్నామనే మాపై కోపం' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ మాటాష్ అవుతుందని.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొంద పెట్టాడని గుర్తుచేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు దాన్ని కూడా నాశనం చేసి ఎవడు ఓటు వేయకుండా చేసి పోతాడని పేర్కొన్నారు.
'రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు చంద్రబాబు దగ్గరి పిల్లి. 4000 మంది పోలీసులను పట్టుకొని సిరిసిల్లకు పోయావు నువ్వు పులివా రేవంత్ రెడ్డి?' అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. '3 సంవత్సరాలు అయింది సీఎం అయి.. ఇంకా నీ ఫ్రస్టేషన్ ఏందిరా బై? అని ప్రశ్నించారు. నేతన్నలు చనిపోతే రూ.6 లక్షల బీమా వచ్చేలా మా హయాంలో నేతన్నకు బీమా అనే పథకం తెచ్చామని.. అది ఇప్పుడు ఆగిపోయిందని గుర్తుచేశారు. బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయి.. రేవంత్ రెడ్డి వీటి గురించి మాట్లాడుతాడు అనుకుంటే మళ్లీ అదే బూతు పురాణం పెట్టాడని అసహనం వ్యక్తం చేశారు. 'ఒక ముఖ్యమంత్రి, ఒక పీసీసీ ప్రెసిడెంట్, ఆరుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు ఏదో దండయాత్రకు వెళ్లినట్లు వెళ్లారు' అని సిరిసిల్ల పర్యటనపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.