కరెంటుపై ఆధారపడకుండా ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీరు రూ. 78,000 వరకు సబ్సిడీ పొందవచ్చు, దీనివల్ల మీ విద్యుత్ బిల్లు సున్నా అయ్యే అవకాశం కూడా ఉంది. సౌర శక్తితో తెలంగాణలోని ప్రతి ఇంటిపై వెలుగులు నిండాలని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కోరుతూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'పీఎం సూర్య ఘర్ ముక్తి బిజిలి యోజన' ద్వారా అర్హులైన గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీనివల్ల సౌర విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా, విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన వినియోగానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ పథకం ద్వారా సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా రూ. 78,000 వరకు సబ్సిడీ అందుతుంది.
ఈ రూ. 78,000 సబ్సిడీ పొందాలంటే పీఎం సూర్య ఘర్ పథకం కింద అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 3 కిలోవాట్ల లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం నుండి గరిష్టంగా రూ. 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. ఉదాహరణకు, 2 కిలోవాట్ల సామర్థ్యానికి రూ. 30,000, ప్రతి కిలో వాట్ సామర్థ్యానికి రూ. 18,000 సబ్సిడీ కూడా అందుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి నిర్ణీత అర్హతలు కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకుంటే, మీకు సంబంధించి వెండర్ వివరాలను కేటాయిస్తారు. తద్వారా మీ ఇంట్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఏవైనా సందేహాలు ఉంటే, అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in/#/ను సందర్శించి దరఖాస్తు వివరాలను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ నంబర్, విద్యుత్ కనెక్షన్ నంబర్ వంటి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత అనుమతి లభించిన వెంటనే, కేటాయించిన విక్రేత ద్వారా సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. నెట్ మీటరింగ్, తనిఖీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత, ఆ వివరాలను పోర్టల్‌లో సమర్పించాలి. అర్హత నిర్ధారణ అయిన తర్వాత, నిబంధనల ప్రకారం సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది.
10 కిలోవాట్ల వరకు వ్యవస్థలకు సంబంధించి, 2026 జూన్ 22 నుండి 2027 మార్చి 31 వరకు నమోదైన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేలా నిబంధనల ప్రకారం దరఖాస్తు ఫీజు మినహాయింపు ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా విక్రతలు మరియు TGREDC/REC అధికారులతో ప్రతి నెలా మొదటి బుధవారం సమావేశాలు నిర్వహిస్తారు. TGSPDCL తన పోర్టల్‌ను 'పీఎం సూర్య ఘర్ పోర్టల్ 2.0'తో అనుసంధానించింది.
సోలార్ రూఫ్ టాప్ ద్వారా సుమారు 20.33 లక్షల గృహాలకు, మొత్తం 4,066 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. అలాగే గ్రామాల్లో సోలార్ వినియోగం కోసం రూ. 943.47 కోట్లు మంజూరు చేశారు. దీనివల్ల మీరు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహ అవసరాలకు కావాల్సిన విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు, దీనివల్ల గ్రిడ్ నుండి తీసుకునే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అదనంగా, ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్‌కు అందించినప్పుడు, నిబంధనల ప్రకారం మీటరింగ్ విధానం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హరిత ఇంధన విస్తరణ ఆలోచనలకు అనుగుణంగా, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రజలు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో భాగస్వాములు కావాలని TGSPDCL కోరుతోంది.