Telangana C Section Rate: తెలంగాణలో పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు.. గ్రామీణ జిల్లాల్లో 80 శాతానికి పైగా..!
Telangana C Section Rate: తెలంగాణలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో పెరిగింది. NFHS-6 తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 62.2 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల వంటి జిల్లాల్లో ఈ రేటు 80 శాతానికి పైగా నమోదైంది.
Telangana C Section Rate: తెలంగాణలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య దేశంలోనే అత్యధికంగా నమోదైంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 (NFHS-6) 2023-24 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 62.2 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాల సగటు 27.2 శాతంగా ఉంది. అంటే తెలంగాణలో నమోదైన రేటు జాతీయ సగటు కంటే రెండింతలకుపైగా ఉంది. అయితే ఈ గణాంకాల్లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. సిజేరియన్ ప్రసవాలు హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే అది పూర్తిగా నిజం కాదు. కొన్ని జిల్లాల్లో ఈ రేటు 80 శాతాన్ని కూడా దాటింది.
రాజన్న సిరిసిల్లలో అత్యధికం
తెలంగాణ జిల్లాల్లో రాజన్న సిరిసిల్లలో సిజేరియన్ ప్రసవాల రేటు అత్యధికంగా ఉంది. ఇక్కడ 82 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగాయి. ఆ తర్వాత జగిత్యాల 81 శాతంతో రెండో స్థానంలో ఉంది. కరీంనగర్‌లో 79.9 శాతం, ఖమ్మంలో 78 శాతం, పెద్దపల్లిలో 76.1 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిర్మల్‌లో 75.3 శాతం, హనుమకొండలో 74.1 శాతం, నిజామాబాద్‌లో 71 శాతం నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాల్లో 19 జిల్లాల్లో సిజేరియన్ రేటు 60 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. మరో 12 జిల్లాల్లో ఇది 70 శాతాన్ని దాటింది.
హైదరాబాద్‌లో మాత్రం తక్కువే
సాధారణంగా సిజేరియన్ ప్రసవాలు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. కానీ తాజా గణాంకాలు మరో చిత్రాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో సిజేరియన్ రేటు 58 శాతంగా ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో హైదరాబాద్ 21వ స్థానంలో ఉంది. మెద్చల్ మల్కాజ్‌గిరిలో 68.2 శాతం ఉండగా, రంగారెడ్డిలో 50.2 శాతంగా ఉంది. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో 70.1 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 59.5 శాతంగా ఉంది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీ రేటు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. తెలంగాణలో ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో 83.9 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రేటు 48.1 శాతంగా ఉంది. కామారెడ్డిలో ప్రైవేట్ ఆసుపత్రుల సిజేరియన్ రేటు 95.2 శాతంగా నమోదైంది. కరీంనగర్‌లో 93.6 శాతం, ఆదిలాబాద్‌లో 93.4 శాతం, మంచిర్యాలలో 92.4 శాతం నమోదయ్యాయి.
అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొన్ని జిల్లాల్లో సిజేరియన్ రేటు ఎక్కువగానే ఉంది. రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది 74.9 శాతంగా నమోదైంది.
Read More: Warangal: వరంగల్ జిల్లాలో అమానుషం.. పదోతరగతి బాలికలకు లైంగిక వేధింపులు.! . ఆత్మహత్యాయత్నం.!.
Read More:KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్