Telangana SI Exam Hall Tickets: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఎస్సై ఉద్యోగాల ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ (www.tgprb.in) ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 275 ఎస్సై పోస్టుల భర్తీకి ఈనెల 29న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాల్లో జరగనుండగా.. ఈ పరీక్షకు 1,60, 712 మంది అభ్యర్థులు హాజరవ్వనున్నారు. హాల్ టికెట్ పై పాస్ పోర్టు సైజ్ ఫొటో అతికించడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు. పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్ టికెట్ తోపాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు కూడా తప్పకుండా తీసుకెళ్లాలి. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్షే రాసే అవకాశం కల్పించారు. వీరిలో అత్యధికంగా 56.84శాతం మంది తెలుగు మీడియంను ఎంచుకున్నారు. 43.02 శాతం మంది ఇంగ్లీష్, 0.12 శాతం మంది ఉర్దూ మీడియంను ఎంపిక చేసుకున్నారు.
ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
అభ్యర్థులు ముందుగా నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ను సందర్శించాలి.
హోమ్‌పేజీలో కనిపించే ‘ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్’ లింక్‌పై క్లిక్ చేయాలి.
అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ కనిపిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ప్రింట్ తీసుకున్న హాల్ టికెట్‌పై నిర్దేశించిన బాక్స్‌లో మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను తప్పనిసరిగా అతికించాలి.
పరీక్షా కేంద్రం వద్ద పాటించాల్సిన నిబంధనలు:
ఫొటో అతికించని హాల్ టికెట్లతో అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే దానిపై ముద్రించిన పరీక్షా కేంద్రం పేరు, చిరునామా, పరీక్ష సమయాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే రోజున హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును విధిగా వెంట తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, వాచీలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అంతేకాకుండా, నియామక ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈ హాల్ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఎస్సై (సివిల్) - 148
ఎస్సై (ఆర్మ్‌డ్ రిజర్వ్) - 14
ఎస్సై (టీజీఎస్పీ) - 12
ఎస్సై (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) - 3
ఏఎస్సై (ఫింగర్ ప్రింట్ బ్యూరో) - 23
ఈసారి ప్రిలిమినరీ పరీక్షలో కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులను నిర్ణయించారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించే పరీక్షలో ఓపీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 30శాతం అంటే 60 మార్కులు సాధించాలి. బీసీ అభ్యర్థులు.. 25శాతంతో 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 20శాతంతో 40 మార్కులు, మాజీ సైనికులు, హోంగార్డులు 20శాతంతో 40 మార్కులు తెచ్చుకుంటే ఫిజికల్ టెస్టులకు అర్హత సాధిస్తారు. గత 2022 పోలీస్ నియామక నోటిఫికేషన్ తో పోలిస్తే ఈసారి కనీస అర్హత మార్కుల నిబంధనల్లో మార్పులు జరిగాయి. అయితే ప్రిలిమినరీలో కనీస అర్హత మార్కులు సాధించడం మాత్రమే ఉద్యోగానికి ఎంపికైనట్లు కాదని.. తదుపరి ఎంపిక దశల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుందని అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Also Read: