Telangana Weather Updates: తెలంగాణలో చలి పులి చంపేస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సాయంత్రం 6 గంటల నుంచే చలి పంజా విసురుతోంది. మొన్నటి దాకా ఉక్కపోతతో పాటు 20 డిగ్రీలకు పైగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రెండు రోజుల్లోనే 15 డిగ్రీల దిగువకు చేరాయి. ఈ పరిస్థితి 21 జిల్లాల్లో కనిపిస్తోంది. అక్కడ 14 డిగ్రీలకు టెంపరేచర్లున్నాయి. రాబోయే 3రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న మూడు రోజుల్లో 11-12 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్..
ఉత్తరాది నుంచి వీచే చలిగాలులతో రాష్ట్ర మంతటా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల దిగువకు పడిపోయే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మూడు రోజుల్లో అది 11–12 డిగ్రీల మేర రికార్డయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.
13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..
ఆసిఫాబాద్, గద్వాల, వరంగల్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 12 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో 14.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.