Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేపు భారీ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కరువు భత్యంతోపాటు పీఆర్‌సీపై కీలక ప్రకటన ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఎందుకంటే మంత్రివర్గ సమావేశం నిర్వహించనుండడంతో ఈ సమావేశంలో తమ డిమాండ్లు, సమస్యలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పటికే తమకు ఇచ్చిన హామీల మేరకు మంత్రివర్గంలో ప్రభుత్వం చర్చించి.. ఒక నిర్ణయం ప్రకటిస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చాలా డిమాండ్లపై అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. సమస్యల పరిష్కారంపై గతంలోనే అనేక హామీలు ఇచ్చింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో తమకు ఎన్నో హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఇచ్చిన హామీలు కాకపోయినా న్యాయపరంగా.. తమకు హక్కుగా రావాల్సిన డిమాండ్లు నెరవేర్చాలని.. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సంక్రాంతికి డీఏ ప్రకటించగా ఇప్పటివరకు ఒక్క డీఏపై కూడా ప్రభుత్వం స్పందించలేదు. సాధారణంగా జనవరి, జూలై నెలలో ఏడాదికి రెండు సార్లు డీఏ ప్రకటించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డీఏలపై పూర్తి నిర్లక్ష్యం ఉంది. దీనికితోడు వేతన సవరణ సంఘం ఇప్పటివరకు పత్తా లేదు. పీఆర్‌సీపై వేసిన కమిటీ గడువు నేటితో పూర్తవుతుంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా అందలేదు. పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి. ఇక ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)పై ఒక స్పష్టత లేదు. వేతనాల్లో నుంచి కోత పడుతున్నా వాటికి సంబంధించిన కార్డులు ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. దీంతో అన్నీ సమస్యలు చుట్టుముట్టడంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం కమిటీలు, చర్చలు అంటూ చాలా కాలయాపన చేసింది. కాలం వెళ్లదీయడం తప్ప తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లు నెరవేర్చడంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ ఉద్యోగు సమ్మెకు సిద్ధమయ్యారు. సమ్మెకు సిద్ధమైన సమయంలో ప్రభుత్వం చర్చలు పిలిచి అప్పటికప్పుడు ఉద్యోగులను శాంతింపజేస్తుంది. తర్వాత యథావిధిగా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు.
ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన వేళ ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగులతో ప్రభుత్వం అర్ధరాత్రి చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఇది జరిగిన తర్వాత రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. మూడు డీఏలు చెల్లించడంతోపాటు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ), ఆరోగ్య కార్డులపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఉద్యోగులు ఆశించినట్టుగా మంత్రివర్గంలో నిర్ణయాలు ఉంటాయా? లేదా అనేది రేపు తెలియనుంది. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు భారీ ఆశల్లో ఉన్నారు.