Bandi Sanjay Press Meet: 'ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగ సంస్థలపై విషం కక్కడం దుర్మార్గం. ఆపరేషన్ సింధూర్, మహదేవ్‌తో ప్రాణాలకు తెగించి వీరోచిత పోరాటం చేసిన సైనికుల త్యాగాలను అవహేళన చేసి దేశ గౌరవాన్ని భంగపర్చిన పార్టీ కాంగ్రెస్. మీడియాను మోడీ మీడియా, గోడీ మీడియా అంటూ అవహేళన చేసింది. అత్యుతున్నత సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు చేస్తోంది. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతోందో కనీసం సమీక్ష చేసుకోవడం లేదు?' అని బండి సంజయ్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, సర్ ఇంఛార్జ్ బండారి శాంతి కుమార్‌తో కలిసి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. 'కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రేపటి ధర్నా గురించి ఎక్కడా చర్చ లేదు. నవంబర్ 1న కాంగ్రెస్ పాలనలో 3 వేల సిక్కులను ఊచకోత కోసిన సంఘటనపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదట సిక్కులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
'ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలపై, సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతూ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేయడం దుర్మార్గం. సర్ అంటే అర్హులందరికీ ఓటు కల్పించడం. అనర్హులను, అక్రమ వలసవాదుల ఓట్లను తొలగించడమే' అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం ఏశారు. 'ఎన్నికల సంఘం ఆ పని చేస్తుంటే ఎందుకింత యాగీ చేస్తున్నారు? మొత్తం 12 సార్లు సర్ ప్రక్రియ జరిగితే. 10 సార్లు కాంగ్రెస్ పాలనలో జరిగితే ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు? కాంగ్రెస్ గెలిస్తే సర్ బాగున్నట్లా? ఓడిపోతే ఎన్నికల సంఘంపై దాడి చేస్తారా?' అని నిలదీశారు.
'నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో కూడా సర్ ప్రక్రియను అమలు చేశారు కదా. పశ్చిమ బెంగాల్‌లో సర్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నది మమతా బెనర్జే కదా? కర్నాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎలక్షన్ కమిషనర్ల అధ్వర్యంలోనే జరిగితే కాంగ్రెస్ గెలిచింది కదా? 10 సార్లు మీకు నచ్చినట్లు ‘సర్’ నిర్వహించడంవల్లే గెలిచారా? దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని చెబుతున్న కాంగ్రెస్ వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదు' అని కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఓటర్లలో 2.8 కోట్ల మంది ఓటర్లు చనిపోయారు. వాటిని తొలగించాలా? వద్దా? కోటికిపైగా ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారు. నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే వారికి ఓటు హక్కు కల్పించి మిగిలిన చోట్ల తొలగించాలా? వద్దా? 6.30 కోట్ల ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లారు. ఎక్కడున్నారో తెలియదు. వాళ్లకు ఎన్నికల సంఘం నోటీసులిచ్చినా స్పందించడం లేదు..రిప్లై లేదు. ఆ ఓట్లను తొలగించాలా? వద్దా' అని ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
'కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 6.30 కోట్ల ఓటర్ల ఆచూకీ కనిపెట్టి ఆధారాలు సమర్పించాలి. వాస్తవానికి 13 కోట్ల ఓట్లు తొలగించలేదు. ముసాయిదా మాత్రమే. ఓటు తీసేస్తే ఆధారాలు సమర్పించి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓట్లు కోల్పోయిన వాళ్లను తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు ఓటర్లుగా నమోదు చేయించే దమ్ములేదా? నిజంగా 13 కోట్ల ఓట్లు తీసేస్తే వాళ్లను తీసుకొచ్చి కోర్టు ముందుంచే దమ్ము లేదా? ఆధారాలతోసహా మీడియా ముందు ప్రవేశపెట్టే చిత్తశుద్ధి లేదా?' అని కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ సవాల్ చేశారు.
'మరణించిన వాళ్లను, దొంగ ఓట్లను, ఆచూకీ లేని వలస ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చాలని కాంగ్రెస్ ధర్నాలు చేస్తోందా? ఆ ఓట్లతోనే కాంగ్రెస్ గెలవాలని చూస్తోందా? తెలంగాణలో 2004 నుంచి ఇప్పటివరకు 18 లక్షల 7 వేల మంది చనిపోయారు. మరో 6 లక్షల 70 వేల ఓట్లు పేరు, ఊరూలేని డూప్లికేట్ ఓట్లు. ఆ ఓట్లను తొలగించాలా? వద్దా?' అని బండి సంజయ్ ప్రశ్నించారు. పాతబస్తీ, మహేశ్వరం నియోజకవర్గాల్లో 2014కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సహా విదేశాల నుండి అక్రమంగా వలస వచ్చిన వేల ఓట్లున్నాయని ఆరోపించారు.
'సర్ ప్రక్రియతోనే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందా? తమిళనాడులో 60 ఏళ్ల నుంచే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. పశ్చిమబెంగాల్‌లో 50 ఏళ్లుగా అధికారంలోకి రాలేదు. సిక్కింలో 1975లో రాష్ట్ర హోదా పొందినప్పటి నుంచి ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. యూపీలో 37 ఏళ్లుగా, బీహార్‌లో 36 ఏళ్లుగా, త్రిపురలో 34 ఏళ్లుగా, గుజరాత్‌లో 31 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఒడిశా, జార్ఘండ్‌లో 26 ఏళ్లుగా, మధ్యప్రదేశ్, నాగాలాండ్‌లో 23 ఏళ్లుగా, గోవాలో 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఏపీ, హర్యానా, మహారాష్ట్రంలో 12 ఏళ్లుగా, అరుణాచల్ ప్రదేశ్, అసోంలో పదేళ్లుగా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లో 9 ఏళ్లుగా అధికారం లేదు. మేఘాలయ, మిజోరాంలో 8 ఏళ్లుగా, పంజాబ్‌లో నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు కదా?' అని కాంగ్రెస్ పార్టీ ఓటముల చిట్టాను బండి సంజయ్ వివరించారు.
'2014 నుంచి 2025 మధ్య 56 సార్లు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది కదా. దేశ ప్రజలంతా కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటున్నారు. సర్ అమలు కాక ముందునుండే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఓడిపోతే సర్‌పై ఏడుస్తూ గెలిస్తే మౌనంగా ఉంటారా? కేరళ, తెలంగాణ, కర్నాటకలో ఈ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగితే కాంగ్రెస్ గెలిచింది కదా!' అని కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తుచేశారు.
'సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ బురద చల్లడం దుర్మార్గం. ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్లు రాజకీయంగా వాడుకుని పదవులిచ్చి కట్టబెట్టింది కాంగ్రెస్సే. దేశ తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్ తమ్ముడు అశోక్ కుమార్ సేన్‌ను ఎంపీగా గెలిపించుకుని న్యాయ శాఖ మంత్రిగా నియమించింది నెహ్రూ ప్రభుత్వం కదా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. 'కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఛీ కొడుతున్నా బుద్ది రావడం లేదు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం పెద్ద జోక్. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీని జనం ఛీత్కరించారు. కాంగ్రెస్ కూటమికి భంగపాటు తప్పదు. అభిశంసన తీర్మానం పెడితే ఎదుర్కొని తీరుతాం' అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
'అభిసంశన తీర్మానమే కాదు ఐక్యరాజ్యసమితి పోయి గగ్గోలు పెట్టినా ఎదుర్కొంటాం. దేశానికి స్వాతంత్ర్యం మేమే తెచ్చామని, దేశ భక్తులమని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఎవరితో కలిసి పోరాడుతున్నారో సోయి ఉందా? బంగ్లాదేశ్ తరహాలో భారత్ లోనూ అల్లర్లు జరిగి మోదీ ప్రభుత్వం కూలిపోవాలని చెబుతున్న నెహా బోరాతో కలిసి ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు అనిపించడం లేదా? పాకిస్తాన్ నిధులతో రంకెలేస్తున్న సీజేపీ నాయకుడు అశుతోష్ రంకాతో కలిసి పోరాడాలనుకుంటున్నారా? విదేశీ నిధులతో బొద్దింకల పార్టీ పెట్టిన అభిజీత్ దీప్కేతో మోదీ ప్రభుత్వంపై కుట్ర చేయడానికి సిగ్గు అనిపించడం లేదా? అసలు కాంగ్రెస్ నాయకులు ఏ దేశభక్తులు? ఏ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో మీకు అర్ధమవుతుందా? విదేశీ నిధులతో నడిచే నెట్‌వర్క్ సంస్థ విజయం సాధించినప్పుడు ఏం జరుగుతుందో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న అల్లర్లు, అరాచకాలే నిదర్శనంగా కన్పించడం లేదా? భారత్ కూడా ఆ దేశాల జాబితాల సరసన చేరాలని కాంగ్రెస్ కోరుకుంటుందా?' అని కాంగ్రెస్ పార్టీని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.