SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 28న రాబోతుంది తుఫాను కాదు..తీవ్ర తుఫాను..ఐఎండీ హెచ్చరిక!

AP Cyclone Alert Today: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వేగంగా బలపడుతూ అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. అక్టోబర్ 28న ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య ఈ తుపాను తీరాన్ని దాటే అవకాశముంది. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్, యానాం పరిధిలోని తీరప్రాంతాలకు అధికారులు 'ప్రీ-సైక్లోన్ వాచ్' జారీ చేశారు.

Written By Harish Darla
Published: Oct 25, 2026, 02:08 PM IST | Updated: Oct 25, 2026, 02:10 PM IST
Join

AP Cyclone Alert Today: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా బలపడిందని న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం తొలుత దక్షిణ దిశగా కదిలి, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం తన పయనాన్ని పశ్చిమ - వాయవ్య దిశగా మార్చుకుంటూ సముద్రంలో మరింత శక్తిని సమీకరించుకోనుంది.

దశలవారీగా తుపాను తీవ్రత..
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ వ్యవస్థ అక్టోబర్ 26 నాటికి తుపానుగా, 27 నాటికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత మరింత శక్తిమంతమై అక్టోబర్ 28 ఉదయం నాటికి 'అతి తీవ్ర తుపాను'గా బలపడుతుంది. అనంతరం అదే రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు.

తీరం దాటే సమయంలో సాధారణ గాలి వేగం గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగానికి చేరవచ్చని అధికారులు హెచ్చరించారు.

సముద్ర వాతావరణ పరిస్థితులు..
సముద్రంలో నెలకొన్న పరిస్థితులు ఈ వ్యవస్థ బలపడటానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయని వాతావరణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 29 - 30 డిగ్రీల సెల్సియస్ మేర ఉండటంతో పాటు మాడెన్ - జూలియన్ ఆసిలేషన్ (MJO) వంటి వాతావరణ అంశాలు దీని తీవ్రతను పెంచేందుకు తోడ్పడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన వాతావరణ మోడల్స్ కూడా ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపే దూసుకొచ్చి అతి తీవ్రంగా మారుతుందని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కొన్ని నమూనాలు ఒడిశా లేదా తమిళనాడు వైపు సూచించినప్పటికీ, ఆ ప్రాంతాల వైపు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

తీర ప్రాంతాలకు హెచ్చరికలు..
తుపాను కదలికలు, తీవ్రతను నిరంతరం సమీక్షిస్తూ తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులతో పాటు సముద్రపు అలల ఉద్ధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES