కోనసీమ అల్లకల్లోలం.. తుఫాను ఎటు కదులుతోంది? APSDMA గ్రాఫికల్ వీడియో ఇదే!
ఏపీని వణికిస్తోన్న అర్నాబ్ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై తీవ్రంగా ఉంది. ఈ తుఫాను యానం సమీపంలో తీరాన్ని తాకినప్పటికీ, పూర్తిగా తీరాన్ని దాటడానికి మరికొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే బులెటిన్ విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం కాకినాడకు సమీపంలో తుఫాను తీరం దాటుతుంది కాబట్టి అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో తుఫాను ఇప్పటికే తీరం దాటిందా?, ల్యాండ్ ఫాల్ అయిందా?, ఇంకా ఎంత సమయం పడుతుంది? అన్న అంచనాలు రెండు జిల్లాల్లో ఇప్పటికీ స్పష్టంగా రావడం లేదు. అయితే, ఏపీఎస్‌డీఎంఏ ఈ తుఫానుకు సంబంధించిన గ్రాఫికల్ వీడియో కూడా విడుదల చేసింది.
Cyclone Arnab Hits APSDMA Graphical Video: కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతమైన ఉప్పాడ అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికీ చాలామంది సురక్షిత కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా వారిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో సుబ్బంపేట, కొత్తపట్నం వద్ద రోడ్లు తెగిపోయి సముద్రపు నీరు పూర్తిగా ఇళ్లల్లోకి చేరింది. దీంతో అక్కడి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బలవంతంగా వారిని బస్సుల్లో తరలించాయి. ఉప్పాడలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడ అలలు కొంతవరకు తగ్గాయి, కానీ, జల్లులు పడుతున్నాయి. అయినప్పటికీ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు అక్కడి పరిస్థితి అత్యంత భయంకరంగా మారింది. ప్రతి చోట అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్ లేకపోయినా ప్రజలను సురక్షితంగా మొదటి అంతస్తులో ఉంచారు.
కాకినాడలోని అన్నవరం సత్యదేవి కళాశాలలో గ్రౌండ్ ఫ్లోర్‌లో చిక్కుకుపోయిన 40 మందికి పైగా విద్యార్థులను మొదటి అంతస్తుకు తరలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాడు ఆరా..
అర్నాబ్ తుఫాన్ కారణంగా రాత్రి 1:00 గంట వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఈరోజు ఉదయం 6:00 గంటలకు మరోసారి కలెక్టర్‌తో మాట్లాడుతూ, పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగకూడదని, అదే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో చాలామంది అధికారులు ఉండిపోవడంతో ఈ విషయాన్ని కాకినాడ కలెక్టర్‌తో పాటు కోనసీమ కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పరిషత్ ఎన్నికలపై ఈరోజు ఎన్నికల కమిషన్ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంధకారంలో కాకినాడ..
కాకినాడలో ఈదురుగాలులకు పలు చెట్లు నేలకూలాయి. తుఫాను ప్రభావంతో కోనసీమ, కాకినాడ జిల్లాలు పూర్తిగా అష్ట దిగ్బంధంలో ఉండిపోయాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి, మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జిల్లా మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ఒకవైపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఊళ్లు, ఇళ్లు ఒకటే అన్నట్లుగా నీరు పొంగి ప్రవహిస్తుండటంతో చీకట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలవరం, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు, తూర్పు–పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని నివేదికలు అందాయి. విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
అధికారుల హెచ్చరికలు..
ఇదిలా ఉండగా, కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కొద్దిసేపటి క్రితం ప్రకటన బులెటిన్ విడుదల చేశారు. ఈ రాత్రి వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. తుఫాను నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోందని, రాత్రి వరకు గంటకు 89 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ బయట కనిపించవద్దని, అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దని సూచించారు. ఇప్పటికే పలుచోట్ల చెట్లు రోడ్డుపై పడ్డాయి, విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు వాతావరణ హెచ్చరికలను తప్పక పాటించాలని కూడా సూచించారు.
తుఫాన్ కదలికల గ్రాఫికల్ వీడియో..
ఇక అర్నాబ్ తుఫాన్‌కు సంబంధించిన గ్రాఫికల్ వీడియో కూడా ఏపీఎస్‌డీఎంఏ విడుదల చేసింది. బంగాళాఖాతంలో మొత్తం 24 గంటలపాటు తుఫాను కదలికలను ఇది సూచిస్తోంది. తీరం దాటే ప్రక్రియ నిలకడగా సాగుతోందని ఏపీఎస్‌డీఎంఏ ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం నరసాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకతమైంది, మధ్యాహ్నానికి ముగిసిపోతుంది. దీంతో భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.