3 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో అలర్ట్..
Heavy Rains in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం శనివారం ఉదయం తీవ్ర అల్ప పీడనంగా బలపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రికి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ తెలిపింది.
Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. నేడు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కోస్తాంధ్ర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఈశాన్య ఋతుపవనాల ప్రారంభం కాలంలో వచ్చిన ఈ తుపానుకు ఆర్నబ్ గా నామకరణం చేశారు. ఇది మరింత బలమైన తుపానుగా రూపాంతరం చెందనుంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలో 120 కిలో మీటర్ల నుంచి 140 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
అంతేకాదు తీర ప్రాంతాల్లో పెద్ద బిల్డింగ్‌లపై ఉన్న హోర్డింగులు తొలిగించాలని వాతావరణ శాఖ కోరింది. బలమైన ఈదురు గాలులకు తోడు ఉరుము, మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. ఈ సమయంలో రైతులు పొలాల్లో ఎలాంటి పనులు చేయోద్దని తెలిపింది. మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కరెంట్ స్తంభాలు, హోర్డింగ్‌లు, చెట్ల కింద నిలుచోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
12 జిల్లాలపై ఎఫెక్ట్..
ఆర్నబ్ తుపాను 12 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది బాపట్లకు 1100 కిలో మీటర్లు.. విశాఖ పట్నానికి 820 కిలో మీటర్లు.. మచిలీ పట్నానికి 1020 కిలో మీటర్లు.. కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేందృకృతమైందని తెలిపింది. సోమవారం ఉదయానికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మంగళవారం తీవ్ర తుపానుగా అర్నాబ్..
మరోవైపు ఎల్లుండి (మంగళవారం)పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన తుపానుగా బలపడి బలమైన ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ, వాయువ్య దిశగా కదలనున్నట్టు తెలిపారు. ఇక బుధవారానికి బాపట్ల - విశాఖ పట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను ప్రభావిత జిల్లాలు..
తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ కృష్ణ, విశాఖ, కాకినాడ, పార్వతీ పురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అటు ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తుపాను నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను తమ పనుల్లో నిమగ్నమయ్యేలా ఆదేశాలు జారీ చేసింది.