Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినిని తోసేసిన ఎస్‌ఐ.. ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్..!
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినిని నెట్టివేసిన మహిళా ఎస్ఐ ప్రియాంకపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనను కలవడానికి వచ్చిన జడ్పీటీసీ అభ్యర్థిని కలవకుండా అడ్డుకోవడమే కాకుండా.. తనను నెట్టి కిందపడేసిన ఘటనపై రజిని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైరల్ వీడియోలు, సాక్ష్యాలను పరిశీలించిన ఎన్నికల కమిషన్.. ఎస్ఐని తక్షణమే అన్ని విధుల నుంచి తప్పించి, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎస్‌ఐపై రాష్ట్రం ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రజని నివాసం వద్ద చిలకలూరిపేట (రూరల్) సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రియాంక ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి.. తోసివేసినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. మీడియాలో వచ్చిన కథనాలు, మాజీ మంత్రి విడదల రజిని సమర్పించిన వినతిపత్రం, ఫోటోలను ఎన్నికల సంఘం పరిశీలించింది.
2026 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం.. సదరు ఎస్ఐపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఎన్నికల విధులతోపాటు అన్ని డ్యూటీల నుంచి ఆమెను తప్పించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా, నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తి చేసి, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని ఎస్పీకి రాసిన లేఖలో ఆదేశాలు జారీ చేసింది.
ఏం జరిగింది..?
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజినిని పోలీసుల మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీకి చెందిన ఓ జడ్పీటీసీ అభ్యర్థి శుక్రవారం బీఫారం తీసుకునేందుకు ఆమె వద్దకు వచ్చారు. పోలీసులు ఆ అభ్యర్థిని ఇంటి బయటే ఆపేశారు. విషయం తెలుసుకుని ఇంటి నుంచి బయటకు వస్తున్న రజినిని ఎస్‌ఐ ప్రియాంక అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ చోటుచేసుకున్న పరిణామాల మధ్య ఎస్ఐ, మాజీ మంత్రిని చేతులతో నెట్టివేశారు. ఈ క్రమంలో విడుదల రజిని కింద పడిపోయారు. దీంతో ఎస్ఐతో మాజీ మంత్రి వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వగా.. ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకుంది.