మూవీ రివ్యూ: రామాయణం(Ramayanam)
నటీనటులు: రణ్‌బీర్ కపూర్, యశ్, సన్ని దేవోల్,సాయి పల్లవి, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, వివేక్ ఓబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన, లారా దత్తా, తదితరులు
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, హన్స్ జిమ్మర్
సినిమాటోగ్రఫీ: పంకజ్ కుమార్, మహేష్ లిమాయో
ఎడిటర్: హుఫేజా లోకండ్వాలా
బ్యానర్స్: ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాంస్టర్ మైండ్ క్రియేషన్స్, DNEG
నిర్మాత: నమిత్ మల్హోత్ర, యశ్,
స్క్రీన్ ప్లే: నితీష్ తివారీ, శ్రీధర్ రాఘవన్
రచన, దర్శకత్వం: నితీష్ తివారి
నిడివి:195 నిమిషాలు (3 గంటల 15 నిమిషాలు)
విడుదల తేది:5-11-2026
నితీష్ తివారి డైరెక్షన్లో , నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా రణ్‌బీర్ కపూర్, యశ్ రాముడిగా.. రావణాసురుడిగా నటించిన చిత్రం ‘రామాయణ’. విడుదలకు పది రోజులు ముందే లాస్ ఏంజెల్స్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ రోజు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వాల్మీకి రామాయనం ఆధారంగా తెరకెక్కించారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
‘రామాయణం’ కథ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది. కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్టుగా సాగిపోతుంది. కానీ ఈ చిత్రాన్ని రామాయణంలోని మొదటి మూడు కాండలే చూపించారు. ఇందులో దేవాసుర సంగ్రామంలో కైకసి (శోభన) ఆధ్వర్యంలో దేవతల చేతిలో రాక్షసులు ఓడిపోతారు. ఆ తర్వాత తన కుమారుడు దశానన (యశ్)తో దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాల్సి సమయం ఆసన్నమైంది. అతనిలో రాక్షసుడితో పాటు పండితుడి లక్షణాలున్నాయని చెబుతుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడిని తపస్సుతో మెప్పిస్తాడు. అంతేకాదు నర, వానరులతో కాకుండా యక్షులు, కిన్నెరలు, కింపురుషులు సహా ఎవరి చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు. అటు అయోధ్యలో దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. దీంతో రామ, భరత, లక్షణ, శతృఘ్నలు జన్మిస్తారు. వారిని కులగురువు వశిష్ఠుడి శిష్యరికంలో అస్త్ర శస్త్రాల్లో ఆరితేరుతారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు తన యాగ రక్షణ కోసం రాముణ్జి పంపమని దశరథున్ని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడికి యాగ సంరక్షణలో భాగంగా తాటకి, సుబాహులను సంహరిస్తాడు. ఆపై సీతా స్వయంవరం, కైకేయి దశరథున్ని రాజ్యాభిషేకం భరతుడికి.. రాముడుకి 14 యేళ్ల వనవాసం చేయాలని చెబుతుంది. తండ్రి ఆజ్ఞాప్రకారం 14 యేళ్లు వనవాసానికి బయలు దేరుతాడు. ఆ పై దశరథుడి నిర్యాణం.. ఆ తర్వాత శూర్పణఖ రాముడిని మోహించడం.. లక్ష్మణుడు ఆమె ముక్కును కోయడంతో రావణాసురుడు సీతాపహరణం చేస్తాడు. అటు రావణుడు సీతాపరణం చేస్తోన్న సమయంలో జటాయువు రావణాసురుడితో పోరాడి కన్నుమూస్తుంది. చివరి క్షణంలో రాముడికి జరిగిన వృత్తాంతం అంతా చెబుతుంది. లంకలో సీత ఉందని చెబుతుంది. ఆ తర్వాత జటాయువుకు ఉత్తర క్రియలు నిర్వహించిన తర్వాత లంక ముల్లోకాల్లో ఎక్కడా ఉన్న వెతికి మరి రావణాసురుడిని సంహరించి సీతమ్మ తీసుకొస్తానని రాముడు ప్రతిజ్ఞ చేయడంతో మొదటి పార్ట్‌కు ఎండ్ కార్డ్ వేశారు.
కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..
రామాయణం పై తెలుగు సహా ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. మన దర్శకులు క్రియేటివ్ లిబర్టీతో వాల్మీకి రామాయణంలో లేనివాటిని ఉన్నట్టుగా చూపించడం చూశాము. దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాపై ఎలాంటి అపవాదు రాకుండా చాలా పకడ్బందీగా ఒళ్లు దగ్గర పెట్టుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. రామాయణం అంటే రాముడు నడిచిన బాట. ఈ సినిమా దేవాసుర సంగ్రామంతో మొదలు పెట్టి.. సీతాపహరణంతో ముగించాడు. ముఖ్యంగా దేవాసుర సంగ్రామం.. ఆపై దశాననుడు అమరత్వం కోసం బ్రహ్మ దేవుడిని మెప్పించే ఎపిసోడ్ బాగుంది. లంకను తన సవతి అన్న అయిన కుబేరుడి నుంచి యుద్ధం చేసి లాక్కొంటాడు. ఇందులో రావణాసురుడు రంభ, నలకూబరుల శాపం చూపించలేదు. తనకు కోడలు వరుస అయిన కుబేరుడు కోడలు.. నలకూబరుడి భార్య అయిన రంభను రావణాసురుడు బలాత్కారం చేస్తాడు. ఆ తర్వాత నల కూబరుడు నీవు ఎవరైనా వారి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే తల వెయ్యి వక్కలవుతుందని శాపం ఇస్తాడు. అది ఈ సినిమాలో చూపించలేదు. బహుశా రెండో పార్ట్‌లో చూపిస్తాడా లేకపోతే రావణాసురుడిని మంచి వాడిగానే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. శూర్పణఖ భర్తను విద్యుత్ జిహ్వుడిని చంపే సీన్ వాల్మీకి రామాయణం ఉన్న దాన్ని పెట్టడం ఆసక్తి రేకిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత ఈ సీన్ వస్తుంది. రాముడిని నీల మేఘశ్యాముడిగా కాకుండా మాములుగా హిందీ సీరియల్స్‌లో చూపించినట్టు చూపించాడు. ఇక రాముడికి అగస్త్యుడు ఆదిత్య హృదయంతో పాటు ఎపుడు బాణాలు తరగని అక్షయ తూరీణాలు ఇవ్వడం.. లక్ష్మణుడికి లక్ష్మణ రేఖ మంత్రం.. సీతమ్మ వారు అడవిలో ఉన్న నగలు పెట్టుకోవాలిని అగస్త్య మహాముని భార్య లోపాముద్ర చెప్పే సీన్స్ వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. వాటిని ఈ సినిమాలో ఓ సన్నివేశంలో పెట్టడం బాగుంది. ఇప్పటి వరకు ఏ దర్శకుడు ఈ సీన్స్‌ను సినిమాలో రాసుకోలేదు.
మనం చూసిన బాపు తెరకెక్కించిన సినిమాల్లో సీతా స్వయంవరంలో రావణాసురుడు వచ్చి ధనుస్సు ఎత్తలేక భంగపడే సీన్స్ ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణంలో అలాంటి ఘట్టమే లేదు. కేవలం కొంత మంది రాజులు శివుడి ధనుస్సు పినాకాను ఎత్తలేక చేతులేత్తేస్తారు. ఈ సీన్ సినిమాలో చూపించిన విధానం బాగుంది.
ఇక రాముడు పుట్టుక నుంచి సీతా స్వయంవరం.. మధ్యలో తాటకి, సుబాహులను సంహరించే సీన్ బాగుంది. ఇంటర్వెల్ ముందు దశరథుడు కైకేయి ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక జన స్థానంలో ఖర, దూషణులను సంహరించే సీన్స్ బాగున్నాయి. అయితే రామ బాణానికి తిరుగులేదంటారు. కానీ ఇందులో రాముడి బాణం ఒకటి రెండు సార్లు తప్పినట్టు చూపించాడు. అంతేకాదు రాక్షసులను చూసి పారిపోయే సీన్స్ వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. దర్శకుడు ఈ విషయంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక పుష్పక విమానంలో సీతాపరణం చేస్తోన్న సమయంలో జటావుయుతో పోరాటాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. మొత్తంగా బాలకాండ, అయోధ్య కాండ, అరణ్య కాండలతో ముగించాడు. ఇక కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధకాండను రెండు పార్ట్‌లో చూపించబోతున్నాడు. గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు తాటకి, సుబాహు, ఖర, దూషణులనే రాక్షసులను చూసి పారిపోయే సీన్స్ వాల్మీకి రామాయణంలో లేదు. రాముడు రాక్షసులను ఎదుర్కునే వీరుడే కానీ.. పారిపోయే వాడు కాదని అందరికీ తెలుసు. తెలిసి తెలిసి దర్శకుడు ఈ సీన్ ను పెట్టకుండా ఉంటే బాగుండేది. మంచి భోజనంలో పంటి కింద రాయిలా అనిపిస్తాయి. ఏఆర్ రెహమాన్ అన్ని కాపీ ట్యూన్స్ కొట్టాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. మరికొరికి ఇచ్చి ఉంటే బాగుండేదేమో. ప్రియురాలు పిలిచింది, జోదా అక్బర్ వంటి సినిమాల్లో కొట్టిన సంగీతాన్ని అటు ఇటు ట్యూన్స్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగున్నాయి. విజువల్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా రామాయణం అనేది అందరికి తెలుసుకోవాల్సి విషయం. ఇప్పటికే పాత జనరేషన్ కొన్ని సినిమాలు, సీరియల్స్‌లో చూశారు. మరి జెన్ జీ, జెన్ ఆల్ఫా తరానికి ఈ సినిమా చూసి రామాయణం గురించి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల విషయానికొస్తే..
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో హుందాతనంతో పాటు వీరత్వం అన్ని చూపించాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. రావణాసురుడిగా యశ్ తన దైన నటనతో ఒదిగిపోయాడు. సాయి పల్లవి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. శూర్ఫణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. విద్యుత్జీవుడిగా వివేక్ ఓబరాయ్ క్యారెక్టర్ పండించాడు. దశరథుడిగా అరుణ్ గోవిల్ సెటిల్డ్ పర్ఫెమన్స్ ఆకట్టుకుంటుంది. గతంలో రామాయణ సీరియల్లో టీవీ రాముడిగా మెప్పించిన ఈ చిత్రంలో దశరథుడిగా మెప్పించాడు. కైకేయి పాత్రలో లారా దత్తా మంచి నటన కనబరించింది. రావణుడి తల్లి కైకసి పాత్రలో శోభన యాక్టింగ్ బాగుంది. కౌసల్య, సుమిత్రా పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. లక్ష్మణుడిగా రవి దూబె తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించాడు. విశ్వామిత్రుడు, విశష్ఠ పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్..
రామాయణ కథ
రణ్‌బీర్, యశ్‌ల నటన
కథ, స్క్రీన్ ప్లే
విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగాలు
మైనస్ పాయింట్స్..
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఆకట్టుకొని పాటలు
రాక్షసుల నుంచి రాముడు పారిపోయే సన్నివేశాలు..
పంచ్ లైన్.. ఓవరాల్‌గా మెప్పించే ఈ తరం చూడాల్సిన సినిమా ‘రామాయణం’..
ఇలాంటి చిత్రాలకు రేటింగ్‌తో పనిలేదు.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇతిహాస మహాకావ్యం..