Ramya Krishna: రమ్యకృష్ణ, కృష్ణవంశీ ఇద్దరూ ప్రస్తుతం తమ తమ పనుల కారణంగా వేర్వేరు నగరాల్లో ఉంటున్నారు. ఈ విషయంపై స్పందించిన రమ్యకృష్ణ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇలా ఉండటమే ఇద్దరికీ సౌకర్యంగా ఉందని చెప్పారు. అంతేకాదు, తమ బంధం గురించి మాట్లాడుతూ, "మేమిద్దరం సంతోషంగా, మా సౌకర్యం ప్రకారం రెండు వేర్వేరు నగరాల్లో ఉంటున్నాం. ఎప్పుడూ గొడవ పడటం కంటే ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నాం. బహుశా అందుకే ఇప్పటికీ మా వివాహ బంధం కొనసాగుతోంది" అని అన్నారు.
వేర్వేరు నగరాల్లో ఉండటానికి కారణాన్ని కూడా ఆమె వివరించారు. గతంలో హైదరాబాద్‌లో ఉంటున్న సమయంలో చెన్నైలో ఒక టెలివిజన్ సీరియల్‌లో నటించాల్సి వచ్చిందని, ప్రతి 15 రోజులకు ఒకసారి షూటింగ్ కోసం ప్రయాణించాల్సి వచ్చేదని తెలిపారు. ఈ ప్రయాణాల కారణంగా తన కుమారుడికి తరచూ జలుబు, అనారోగ్య సమస్యలు వచ్చేవని చెప్పారు. దీంతో ఈ విషయం కృష్ణవంశీతో చర్చించి, కుమారుడిని చెన్నైలోని పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నారట. అప్పటి నుంచి రమ్యకృష్ణ తన కుమారుడితో కలిసి చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఇక పెళ్లి గురించి రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన దృష్టిలో పెళ్లి అనేది కొన్నిసార్లు అతిగా ప్రాధాన్యం ఇస్తున్న ఒక ప్రక్రియ అని ఆమె అభిప్రాయపడ్డారు. తాము ప్రేమలో ఉన్న సమయంలో కృష్ణవంశీ పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కలిసి జీవిద్దామని సూచించారట. అయితే అప్పట్లో ఆ ప్రతిపాదనకు ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, పెళ్లి కంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కు ఓకే చెప్పాల్సిందేమో అనిపిస్తుందని ఆసక్తికరంగా వెల్లడించారు.
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయం కాదని, దాని చుట్టూ కుటుంబాలు, ఇతరుల అంచనాలు కూడా ఉంటాయని రమ్యకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇవన్నీ కొన్నిసార్లు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత క్లిష్టంగా మార్చవచ్చని చెప్పారు. అయితే కృష్ణవంశీతో తన అనుబంధంపై ఎలాంటి అసంతృప్తి లేదని, తమ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందని ఆమె స్పష్టం చేశారు. పెళ్లి కంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, స్నేహంగా ఉండటమే ముఖ్యమనే భావనను రమ్యకృష్ణ తన మాటలతో వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read More: Chandini Chowdary: ప్రశ్నిస్తే టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తారా..?.. విశాఖ కొండల తవ్వకాలపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..