School Shooting Victims: అమెరికాలో దారుణం జరిగింది. ఒరెగాన్ లోని బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ పాఠశాలలో 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కాగా నిందితుడిని ఓ సామాన్య పౌరుడు వెంబడించి కాల్చి చంపాడు.
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. ఓ పొడవాటి గన్ తో స్కూళ్లోకి ప్రవేశించిన నిందితుడు.. తాళం వేసి ఉన్న డోర్లను కాల్చుకుంటూ లోపలికి వెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 5,8,11ఏళ్ల వయస్సుకన్న ముగ్గురు చిన్నారులతోపాటు ఒక టీచర్ అక్కడికక్కడే మరణించారు. మరో టీచర్..7ఏళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వారిని సెయింట్ చార్లెస్ మెడికల్ సెంటర్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మధ్యాహ్నం 12:59 గంటలకు పాఠశాల సమీపంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు మొదట సమాచారం అందింది. నిమిషాల వ్యవధిలోనే, పాఠశాలలో కాల్పులు జరిగాయని కాల్స్ వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 1:02 గంటలకు పోలీసులు పాఠశాలకు చేరుకునేసరికి, తుపాకీ గాయాలతో నిందితుడు మరణించాడు. తుపాకీతో ఉన్న వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించడాన్ని ఒక పౌరుడు చూసి, అతడిని వెంబడించి కాల్చి చంపాడని బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంట్జ్ తెలిపారు.
ఈ ఘటన కారణంగా బెండ్-లా పైన్ స్కూల్ డిస్ట్రిక్ట్లోని పాఠశాలలను శుక్రవారం మూసివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్బిఐ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎవరు? అతనికి పాఠశాలతో ఏమైనా సంబంధం ఉందా? కాల్పులకు దారితీసిన కారణాలు ఏమిటి? వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆకస్మిక దాడితో సమాజం దిగ్భ్రాంతికి గురైందని, ఇది మాటల్లో చెప్పలేని విషాదమని పాఠశాల సూపరింటెండెంట్ స్టీవెన్ కుక్ అన్నారు.