America Vs Houthis: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హౌతీలపై విరుచుకుపడ్డారు. ఇరాన్ ఆదేశాల మేరకే హౌతీలు సౌదీ అరేబియాపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు చమురు ధరలను భారీగా పెంచి అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు.
హద్దు మీరిన హౌతీలు..
హౌతీల దాడులను తాను మర్చిపోనని, ఎన్నికల అనంతరం అమెరికా నుంచి తగిన తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రూత్ సోషల్ వేదికగా ఆయన హెచ్చరించారు.హౌతీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఏడాది కిందట హౌతీలపై అమెరికా తీవ్రస్థాయిలో బాంబుల వర్షం కురిపించినప్పుడు వారు గుణపాఠం నేర్చుకున్నారని అనుకున్నానని భావించాను. అప్పుడు వారి విజ్ఞప్తి మేరకే దాడులు ఆపాను.
చాలా కాలం ప్రశాంతంగా ఉన్న వారు, ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి దాడులకు తెగబడుతున్నారు అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు.అక్టోబర్ 10న సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. ఈ భీకర దాడుల్లో హైదరాబాద్ వాసి సహా మొత్తం 13 మంది మృతి చెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు.
హౌతీల దాడులతో సౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం..
యేడాది తర్వాత హౌతీలు మళ్లీ దాడులు ప్రారంభించడంతో, హార్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇది సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో. ఈ ఏడాది సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ 3.3% క్షీణించవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.