Delhi Court Shock to CJP Leaders: దేశ రాజధాని ఢిల్లీలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జంతర్ మంతర్లోకి ప్రవేశించారనే ఆరోపణలపై అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్ను ధర్నాలు, ఆందోళనల వేదిక జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువరించిన మరుసటి రోజే వీరు గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా త్రివర్ణ పతాకాలతో జంతర్ మంతర్ ప్రాంగణంలోకి ప్రవేశించి నిరసన గళం విప్పడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ కోర్టు వీరిద్దరికీ ఐదు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నిరసనకారులను జైలుకు తరలించారు. ఈ అరెస్టులు, రిమాండ్పై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సహా ఇతర పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cockroaches @AjinkyaCJP, @AshutoshRanka & @SauravDassss inside the parliament street police station. Nothing can break their spirits. What a cool picture @whattalawyer https://t.co/aMtdwZb9Ip
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 13, 2026
జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని అణచివేయడానికి అప్రకటిత ఎమర్జెన్సీ తరహా నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని విమర్శిస్తూ.. ఎన్ని అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.