Suryakumar Yadav Trade News: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ టీమ్ ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే టీమ్‌ను వీడడం దాదాపు ఖాయం కాగా.. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా టీమ్ నుంచి రిలీజ్ చేసేందుకు ముంబై ఫ్రాంచైజీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్‌ను ట్రేడ్ చేసుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై ముంబై ఇండియన్స్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఈ స్టార్ బ్యాటర్‌ను వదులుకునేందుకు ముంబై సిద్ధంగా లేదని చెబుతున్నాయి.
వచ్చే సీజన్‌కు ముందే జట్ల కూర్పులో కీలక మార్పులు చేసుకుంటున్నాయి. రిటెన్షన్ జాబితా సమర్పించేందుకు ఈ నెల 17వ వరకు అవకాశం ఉంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేరు ట్రేడింగ్ చర్చల్లో ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే లక్నో సూపర్ జెయింట్స్ సూర్యను తమ జట్టులోకి తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ డీల్ కార్యరూపం దాల్చడం అంత సులభంగా కనిపించడం లేదు. సూర్యను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం సుముఖంగా లేదని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఐపీఎల్ 2026 తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టును వీడటంతో ఆ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్‌పై లక్నో యాజమాన్యం దృష్టి పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ అనుభవం ఉండటంతో పాటు బ్యాటింగ్‌లోనూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సామర్థ్యం అతడికి ఉండటం ఎల్‌ఎస్‌జీ ఆసక్తికి కారణంగా తెలుస్తోంది.
మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగితే సూర్యకుమార్‌ను లక్నోకు ట్రేడ్ చేసే అవకాశాలను పరిశీలించవచ్చనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ముంబై ఇండియన్స్ వర్గాలు సూర్యకుమార్‌ను ట్రేడ్ చేసే ఆలోచన తమకు లేదని చెప్పేసినట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. సూర్య విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 717 పరుగులు చేశాడు. అయితే 2026లో మాత్రం ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేదు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 270 పరుగులే చేశాడు. దీంతో అతడి భవిష్యత్తుపై ట్రేడ్ ఊహాగానాలకు కారణమైంది. అయితే గత సీజన్‌లో ఫామ్ కోల్పోయినంత మాత్రాన సూర్యను వదులుకోవడానికి ముంబై సిద్ధంగా లేదని తెలుస్తోంది. జట్టులో అతడికి ఉన్న అనుభవం.. బ్యాటింగ్ సామర్థ్యం దృష్ట్యా మరో సీజన్ కూడా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.