ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు? ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన..!!
Telangana Employees JAC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.
Telangana Employees JAC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు.. సంస్థలలో ప్రస్తుతం అమలవుతున్న తీరులోనే రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఉమ్మడి జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజును నేరుగా కలసి అధికారికంగా వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పనివేళలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మార్చాలంటూ జేఏసీ ప్రతిపాదించింది. ఈ విధానం అమలు అయినట్లయితే.. రోజుకు ఏడున్నర గంటల పనివేళలు ఉంటాయని.. రెండవ శనివారం సాధారణ సెలవును పరిగణలోనికి తీసుకుంటే వారానికి 37.5 గంటల పని పూర్తి అవుతుందని జేఏసీ వివరించింది.
ఎల్ నినో ప్రభావం వల్ల నీరు, విద్యుత్, ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందని జేఏసీ తన వినతిపత్రంలో పేర్కొంది. ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్, నీటి వినియోగం తగ్గుతుందని తెలిపింది. వాహనాల రద్దీ తగ్గడం వల్ల ఇంధనం ఆదా అవుతుందని, వాయు కాలుష్యం తగ్గుతుందని కూడా పేర్కొంది.
ఉద్యోగులకు వారానికి రెండు రోజుల విశ్రాంతి ఇవ్వడం వల్ల పని ఒత్తిడి తగ్గి, సామర్థ్యం, పనితీరు మెరుగుపడతాయని జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని వారు తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ఐదు రోజుల పనివారం విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని వారు ప్రధాన కార్యదర్శిని కోరారు.
Also Read:
2 లక్షల మందికి కేవలం 33 వేల మందే దరఖాస్తు.. NMMS స్కాలర్‌షిప్‌పై విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ..!!
పాఠశాల గదిలోనే క్రూరత్వం.. తోటి విద్యార్థినిపై బాలుడి వికృత దాడి.. స్పృహ కోల్పోయినా వదల్లేదు