SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీలో తీరం దాటనున్న 'అర్నాబ్' తుఫాను.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఖాయం!

బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అర్నాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణలో 28వ తేదీన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. తీరం దాటిన తర్వాత తుఫాన్ ఉత్తర దిశగా కదులుతూ, రాష్ట్రంలోని తూర్పు జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రమంతటా వాతావరణం చల్లగా ఉంటుందని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి రాఘవేంద్రతో జీ తెలుగు న్యూస్ ముఖాముఖి నిర్వహించింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 27, 2026, 09:23 AM IST | Updated: Oct 27, 2026, 09:30 AM IST
Image Credit: Cyclone Arnab Telangana Rainfall Warning:
Join

Cyclone Arnab Telangana Rainfall Warning:  నాలుగు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తుఫాన్‌గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాన్ ఏ ఏ రాష్ట్రాలపై ప్రభావం చూపబోతుందో, తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రాఘవేంద్రతో జీ తెలుగు న్యూస్‌ ముఖాముఖి నిర్వహించింది. ముందుగా ఈ తుఫాన్‌కు నామకరణం చేసింది ఎవరు? అదేవిధంగా ఈ తుఫాను ఏ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా తెలంగాణపై ఎలా ఉండబోతుంది అనే విషయాలు జీ తెలుగు న్యూస్‌తో వాతావరణ శాఖ అధికారి పంచుకున్నారు.

నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 IST కి తుఫాన్‌గా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. దీనికి అర్నాబ్ అనే పేరు పెట్టారు. రాబోయే 24 గంటల్లో, అంటే ఈ రోజు రాత్రికి తీవ్ర తుఫాన్‌గా, ఆ తర్వాత రేపటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారి, బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. తీరం దాటిన తర్వాత ఇది ఉత్తర దిశగా కదులుతూ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో 28వ తేదీన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. వీటికి ఆనుకొని ఉన్న జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇక ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, ఇది తీరం దాటిన తర్వాత ఉత్తర దిశగా కదులుతుంది. ఈ ఉత్తర దిశ కదలిక వల్ల తెలంగాణపై తుఫాన్ ప్రభావం తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా పడవచ్చు కానీ, గాలుల ప్రభావం మాత్రం పెద్దగా ఉండదు. అందుకే ప్రస్తుతం ఆరెంజ్ కలర్ అలర్ట్ ఇచ్చారు. గతంలో ఒక అల్పపీడనం తుఫాన్‌గా మారి ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లినప్పుడు తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి, వరంగల్ నగరం లాంటి ప్రాంతాలు నీట మునిగింది.


ఈ తుఫాన్ ల్యాండ్‌ఫాల్ నర్సాపూర్ దగ్గర జరిగింది. ల్యాండ్‌ఫాల్ తర్వాత ఇది పశ్చిమ దిశగా కదిలింది.  ఉత్తర-పశ్చిమ దిశగా కదిలితే తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ప్రస్తుతం పూర్తిగా ఉత్తర దిశగానే కదులుతోంది కాబట్టి తెలంగాణపై ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చన్నారు. తుఫాన్ వర్షాలు ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు. ఇవి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయి. ఎల్ నినో వేరు, తుఫాన్లు వేరు. ఎల్ నినో ఒక గ్లోబల్ స్కేల్ ఫినామినా. తుఫాన్లు మాత్రం సినాప్టిక్ స్కేల్ సిస్టమ్స్, ఇవి సాధారణంగా 10 డిగ్రీల అక్షాంశ, రేఖాంశాల పరిధిలోనే ఏర్పడతాయి. కాబట్టి వీటిని నేరుగా ముడిపెట్టలేం. ఎల్ నినో ప్రభావం తుఫాన్‌పై ఉంటుంది, కానీ తుఫాన్ ప్రభావం ఎల్ నినోపై ఉండదు.

ఈ తుఫాన్ తెలంగాణపై ఎన్ని రోజులు ప్రభావం చూపుతుంది?
తెలంగాణలో ముఖ్యంగా 28వ తేదీన మాత్రమే కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది. 27న కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు ఉంటాయి. 29న కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుంది.. కానీ ప్రధాన ప్రభావం 28వ తేదీన ఉంటుంది.
ఈ తుఫాన్ మినహా సముద్ర ప్రాంతంలో ఇతర అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా?
ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం, రాబోయే నాలుగు రోజుల్లో ఎలాంటి కొత్త వ్యవస్థలు ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. ఈ తుఫాన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌పైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఐఎండీ ఎలాంటి నివేదిక ఇచ్చింది?
ఈ ఏడాది ఎండాకాలం ఇంకా మొదలవ్వలేదు, కానీ తెలంగాణలో ఇప్పటికే అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో నమోదైంది. ఇప్పుడు చలికాలం కూడా ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయన్నది నిజమే. అయితే సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా ఉండటం వల్ల చలి తీవ్రత కొంచెం తగ్గుతుంది, కానీ చలికాలం కచ్చితంగా ఉంటుందన్నారు.

ఇక ఎల్‌నినో విషయానికొస్తే, అది ఒక రోజులో మారిపోయేది కాదు. ఎల్‌నినో అనేది ఏడాది పొడవునా కొనసాగే ఒక ప్రక్రియ. ఒకసారి ఎల్‌నినో మొదలైతే, దాని రూపం తీవ్రంగా మారి, మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి కనీసం 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది. కాబట్టి జూన్, జూలై నెలల్లో ఎల్‌నినో ప్రభావం తగ్గి, వాతావరణం కొంత తటస్థ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also: అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..
 

ఇక అర్నాబ్ తుఫాను ప్రభావం కేవలం 28వ తేదీన మాత్రమే తెలంగాణపై ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అందుకే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారిన తర్వాత ఉత్తర దిశగా కదులుతుంది కాబట్టి, తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుంది. కొంతకాలం చలి తీవ్రత కూడా ఉంటుంది, అలాగే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES