Telangana Rain Alert: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్‌లలో చాలా ప్రాంతాల్లో అనుకున్నంత రేంజ్‌లో వర్షాలు పడలేదు.ఈ నేపథ్యయంలో పలు ప్రాంతాల్లో ఆహార ధాన్యల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈదురు గాలులతో కూడిన వర్షాలు..
ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో హోర్డింగులు దగ్గర ఎవరూ ఉండరాదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోత దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో కరెంట్ వాడకం కూడా పెరిగింది. గతంలో కంటే ఈ సారి కరెంట్ వాడకం పెరగడం గమనార్హం.
ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన పంటలు.. భారీగా పెరిగిన ధరలు..
ఇక ఈ యేడాది ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ప్రజల నిత్యవవసరాలైన సన్న బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం కిలో రూ.50-55 మధ్య ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా రూ.65 నుంచి రూ.83 వరకు చేరాయి. తక్కువ నాణ్యత ఉన్న సన్నరకం బియ్యం సైతం రూ.60కి పైమాటే ఉంది. నూకల ధరలూ పెరగడం గమనార్హం. గతంలో కిలో రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.30కి చేరాయి. యాసంగిలో వరి సాగు తగ్గడంతో మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.