Warangal Khammam And Nalgonda MLC: సొంత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన మాజీ ఎమ్మెల్సీ కవిత తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఆమె పార్టీ పోటీ చేయనుంది. ఈ సందర్భంగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కవిత ప్రకటించారు. ప్రధాన రాజకీయ పార్టీలతో తలపడేందుకు సై అన్నట్టు కవిత అభ్యర్థిని నిలబెట్టారు. ఇంతకీ పోటీ ఎక్కడ? అభ్యర్థి ఎవరనేది తెలుసుకుందాం.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. దసరా పండుగ శుభ ముహూర్తాన పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్‌ను కవిత ఖరారు చేశారు. ఇక దీంతోపాటు వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కో ఆర్డినేషన్ కోసం స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను ఆమె నియమించారు.
ఉమ్మడి వరంగల్ (ప్రస్తుత మహబూబాబాద్) జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కాకతీయ యునివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ జాగృతిలో మొదటి నుంచి పని చేస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చానెల్స్ డిబేట్లలో, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ గొంతుకగా నిలిచిన అతడికి కవిత అవకాశం ఇచ్చారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి శాసన మండలి ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థులను కవిత రంగంలోకి దించుతున్నారు. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా అధికారికంగా శ్రీకాంత్ గౌడ్ పేరు ప్రకటించారు. బహుజనుల గొంతుకగా మూడేళ్లుగా అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసిన కల్వకుంట్ల కవిత అదే సంప్రదాయాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనలో కొనసాగించారు