SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కేసీఆర్ కుటుంబ ఆస్తులు వివరాలు..

KCR Assets: తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదం దుమారం రేపుతోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భూ గణాంకాలు వెల్లడించిన తర్వాత రాజకీయంగా హీటెక్కింది. కేసీఆర్ కుటుంబానికి ఉన్న భూ వివరాలపై ఆసక్తికర చర్చసాగుతోంది. రాజకీయ ప్రముఖుల్లో ఎవరెవరు ఎంతమేర భూములు సంపాదించారనే అంశంపై సవాళ్లు విసురుతున్నారు? రాజకీయాల్లోకి రాకముందు ఉన్న భూములెంత? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములున్నాయనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు భూములు ఎలా సంపాదించారు? రాజకీయాలు ఆర్థిక వనరులు సమకూరుస్తాయా? రాజకీయ నాయకుల భూ వివాదాలపై జీ తెలుగున్యూస్ స్పెషల్…!!

Reported By TA Kiran Kumar Sharma Written By TA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 06:22 AM IST | Updated: Sep 22, 2026, 06:28 AM IST
Image Credit: Telangana Politics Hot Topic
Join

Revanth Assets Vs KCR Assets: తెలంగాణ అంతటా ఒకటే చర్చ… ఏ నాయకుడికి ఎన్ని భూములున్నాయి. ఎవరు ఎలా సంపాదించారనే అంశపై దుమారం రేగుతోంది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...మాజీ సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న భూముల వివరాలను అధికారిక రికార్డులతో సహా సభలో బహిరంగంగా వెల్లడించారు. ఈ పరిణామం తర్వాత హైదరాబాద్ కూడళ్లలో కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలతో ప్లెక్సీలు వెలిశాయి.

ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ ఆస్తులు వివరాలుతో ఫ్లెక్సీలు.. 
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతల ఆస్తుల వివరాలతో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల లెక్కలు, సర్వే నెంబర్లతో కూడిన భారీ ఫ్లెక్సీల ప్రదర్శనపై ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై  చర్చసాగిస్తున్నారు.

కేసీఆర్ కుటుంబంలో ఎవరికి ఎన్ని ఎకరాలు..

తెలంగాణను కుదిపేస్తున్న వివాదాస్ప భూముల సమస్యకు ప్రభుత్వ పరిష్కార చర్యలపై చర్చసాగుతున్న సమయంలో 22ఏ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ భూ వివరాలను ప్రస్తావించడం సంచలనంగా మారింది. కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాలోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాలున్నాయని వెల్లడించారు. 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌కు ఉందా లేదా తేల్చాలని స్పష్టం చేశారు. 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతానని, శుద్ధి చేసిన చోటే దళితులకు భూములిచ్చి యజమానులను చేస్తానని ఘంటాపథంగా చెప్పారు. సిద్దిపేటలో కేసీఆర్‌ కుటుంబానికి 67.5 ఎకరాలు ఉన్నాయని, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో కవిత కుటుంబానికి 37 ఎకరాలు ఉన్నాయన్నారు. జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు ఉన్నాయని, నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎదురుదాడి..

అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ భూముల వివరాలు వెల్లడించిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మాటలతో దండెత్తారు.  ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలన్నారు.  రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపిందని కేటీఆర్, హరీష్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ ఆస్తుల వివాదాన్ని తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

పీసీసీ ఛీఫ్ సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన  ఆఫ్ ది రికార్డ్ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తుల పెరిగిపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ భూముల గురించిన వివరాలను చాలా లోతుగా సభ దృష్టికి తీసుకువచ్చారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 2004, 2009 ఎన్నికల అఫిడవిట్లలో కేసీఆర్‌కు భూములు లేవన్నారు.  కానీ 2014 నాటికి 35 ఎకరాలు, 2018లో మరింత పెరిగి, 2023 నాటికి 53 ఎకరాలు ఉన్నట్లు చూపించారని వివరించారు. 2023 నాటికి కేటీఆర్ కుటుంబ పేరిట 123 ఎకరాలు వచ్చాయని, 2026 నాటికి కేటీఆర్ 67 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. సమర్పించిన అఫిడవిట్లకు, అసలు ఆస్తులకు ఎక్కడా పొంతన లేదన్నారు.  తెలంగాణలో గజం భూమి లేని పేదలు ఎందరో ఉండగా కేసీఆర్ కుటుంబానికి ఇన్ని భూములు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ భూములపై సమగ్ర విచారణ..

రాజకీయాల్లోకి రాకముందుగా ఉన్న భూములకు, అధికారం చేపట్టిన తర్వాత భూములకు తేడా ఎలా వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.  కేసీఆర్ కుటుంబం వద్ద ఉన్న భూములపై కచ్చితంగా సమగ్ర విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్  ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్ధేశం తమని కాదన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత రాష్ట్రంలోని దళితులు, బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్న విషయాన్ని ప్రస్తావించారు.

అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరికివారు ఫామ్ హౌస్ లను నిర్మించుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు. రాజకీయాల్లోకి రాక మునుపు… కనీసం సొంత ఇల్లు కట్టుకోడానికి వీల్లేని వారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ నిర్మించుకునే పరిస్థితి ఎలా వచ్చిందనే విషయం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

జన్వాడ ఫామ్ హౌస్‌ వివాదం.. 

జన్వాడ ఫామ్‌హౌస్‌తో తనకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని, దానిని తన చిన్ననాటి స్నేహితుడైన ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ స్పష్టం చేశారు.

జన్వాడ ఫామ్‌హౌస్ తనది కాదని కేటీఆర్ అంటున్నారని, కానీ ఆయన అక్కడే ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ ఫామ్‌హౌస్‌ను నిర్మించారని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ఎవరి ప్రైవేట్ ఆస్తులను లాక్కునే ఉద్దేశంతో లేదని స్పష్టం చేశారు.

జన్వాడ ఫామ్‌హౌస్ భూమి కేటీఆర్ భార్య శైలిమ, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందని, లీజు అనేది ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ నాయకులు  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  ఆరోపించారు. 111 జీవో నిబంధనలను ఉల్లంఘించి ఈ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.

ఫామ్‌హౌస్ భూమి పూర్తిగా తన సొంతమని, కేటీఆర్‌కు ఇందులో ఎలాంటి సంబంధం లేదని యజమాని ప్రదీప్ రెడ్డి వెల్లడించారు. తాను కేటీఆర్‌కు దీనిని లీజుకు ఇచ్చినట్లు ఆయన స్పష్టంచేశారు.  ప్రభుత్వ అధికారులు లేదా రెవెన్యూ శాఖకు ఏమైనా అనుమానాలు ఉంటే తనకు నోటీసులు ఇవ్వొచ్చన్నారు.  చట్టపరంగా పత్రాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని జన్వాడ ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి తెలిపారు.

రాజకీయ కక్ష్య సాధింపు చర్య.. 
సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు భూములు, ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది.  ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అని, ఫామ్‌హౌస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ శ్రేణులు, నేతలు మండిపడ్డారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన భూముల్లో అసలు ఫామ్‌హౌసే లేదని, కనీసం బాత్రూం కూడా లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో ఉన్నాయని తెలిపారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES