Dating App Scam: ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌లో అమ్మాయి పరిచయం అయింది. మెసేజ్‌లు, కాల్స్ మాట్లాడుకున్నారు. మరో స్టెప్ ముందుకు వెద్దామని యువతి తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచింది. ఇక యువతి రూమ్‌కు పిలవగానే అతను ఎగిరి గంతేశాడు. ఎంజాయ్ చేద్దామని బాగా రెడీ అయి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత గానీ మనోడికి అసలు ట్విస్ట్ తెలియలేదు. ఎదురుగా ఉన్న ఆమె ముఖానికి మాస్క్ తీసి మాట్లాడేసరికి అతని కాళ్ల కింద భూమి కంపించినంత పనైంది. డేటింగ్ యాప్‌లో తనతో ఇన్నాళ్లూ చాట్ చేసింది అమ్మాయి కాదు.. ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిసి బిత్తరపోయాడు. ట్రాన్స్‌జెండర్‌తోపాటు మరో వ్యక్తి కలిసి అతడిని బెదిరించి.. బంగారం దోచుకున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లలో అమ్మాయిల ప్రొఫైల్స్ చూసి మురిసిపోయే యువకులకు కళ్లు తెరిపించే షాకింగ్ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది.
బెంగళూరు నగరంలో నాగరాభవిలోని ఒక వ్యక్తిని కత్తితో బెదిరించి.. దాదాపు 226 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించిన ఘటనలో చంద్ర లేఅవుట్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి ఓ డేటింగ్ యాప్‌లో అందమైన అమ్మాయి ప్రొఫైల్ కనిపించింది. ఇంకేముంది వెంటనే లైక్ కొట్టడం, అటు నుంచి రిప్లై రావడంతో ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. మెసేజ్‌లు, చాటింగ్‌లు తరువాత తన రూమ్‌కు రావాలని బాధితుడిని అమ్మాయి పిలిచింది.
సరదాగా ఎంజాయ్ చేద్దామని.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా డేట్ ప్లాన్ చేసుకుని, బాగా రెడీ అయి ఊహల్లో విహరిస్తూ చెప్పిన లొకేషన్‌కు చేరుకున్నాడు. తీరా ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టి లోపలికి అడుగుపెట్టిన తర్వాత మనోడికి సినిమా కనిపించింది. ఆ భయం నుంచి బయటపడి అక్కడి నుంచి జారుకుందామని చూసేలోపే సీన్ మొత్తం మారిపోయింది. అమ్మాయి మాస్క్ తీయగా ట్రాన్స్‌జెండర్ అని తెలిసి షాక్‌కు గురయ్యాడు. అంతేకాదు పక్క గదిలోంచి మరొక వ్యక్తి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇద్దరూ కలిసి తలుపులు గడియపెట్టి.. క్షణాల్లోనే జేబులోంచి పదునైన కత్తిని తీసి బాధితుడి గొంతుపై పెట్టారు. ఏమాత్రం అరచినా.. ఎదురుతిరిగినా ప్రాణాలు తీస్తామని గట్టిగా హెచ్చరించారు. భయంతో బిగుసుకుపోయిన బాధితుడిని బంధించి.. అతని వద్ద దాదాపు 226 గ్రాముల బంగారు ఆభరణాలను లూటీ చేశారు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యారు. బాధితుడు లబోదిబోమంటూ చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులు నాజియా, సయ్యద్ మౌషిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేసే పనిలో పడ్డారు. డేటింగ్ యాప్‌లలో అమ్మాయిల ముసుగులో వల విసిరే ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.