Motivational story: ఒక ఊరి చివర ఉన్న పశువుల ఫారంలో ఇరవై క్రూరమైన నక్కలు ఉండేవి. ఒకరోజు ఫారం యజమాని ఒక కొత్త పందిని తెచ్చి ఆ నక్కలు ఉన్న ప్రాంగణంలోనే పడేశాడు. ప్రారంభంలో ఆ పంది ప్రాణభయంతో వణికిపోయింది. నక్కలు ఎప్పుడు తనపై దాడి చేసి చంపి తింటాయో అని భయపడింది. కానీ వింతగా ఆ నక్కలు పంది వైపు కనీసం చూడలేదు, ఎలాంటి హాని తలపెట్టలేదు.
రోజులు గడుస్తున్నాయి. యజమాని ప్రతిరోజూ పందికి కడుపు నిండా మంచి ఆహారం అందించేవాడు. నక్కలు కూడా దాని జోలికి రాకపోవడంతో పందికి మనసులో ఉన్న భయం పూర్తిగా పోయింది. ఇక్కడ తిండికి కొదువ లేదు, ఎలాంటి ప్రమాదం లేదు అనే బలమైన భరోసా దానికి వచ్చేసింది. ఆ భరోసాతో పంది పూర్తిగా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. శ్రమ లేకుండా తినడం, హాయిగా నిద్రపోవడం తప్ప దానికి మరొక పని లేకుండా పోయింది.
శారీరక శ్రమ లేకపోవడంతో పంది ఒళ్లు విపరీతంగా పెరిగిపోయి బలిసిపోయింది. కొన్నాళ్లకు దానికి కనీసం నడిచే అలవాటు కూడా పోయింది. శరీరం అంతగా బరువు పెరగడంతో దాని కాళ్లు ఆ బరువును మోయలేకపోయేవి. కనీసం నిలబడలేని, పరుగెత్తలేని స్థితికి ఆ పంది చేరుకుంది.
సరిగ్గా ఇదే అదనుగా చూసి నక్కలు తమ అసలు రూపాన్ని బయటపెట్టాయి. పంది శరీరం బరువుతో కదల్లేని స్థితిలో ఉందని, అది తిరగబడలేదని గ్రహించిన నక్కలు మెల్లగా దాన్ని చుట్టుముట్టాయి. ఒక్కసారిగా దాడి చేయకుండా, నెమ్మదిగా రోజూ కొద్దికొద్దిగా పందిని కొరకడం ప్రారంభించాయి. కనీసం లేచి నిలబడలేని, పారిపోలేని స్థితిలో ఉన్న ఆ పంది, ఆ బాధను భరించలేక తనంతట తానే ప్రాణాలు విడిచింది. చివరకు బలిసిన ఆ పందిని ఇరవై నక్కలు పంచుకుని తినేశాయి.
కథలోని అంతరార్థం :
పరిస్థితులు సౌకర్యవంతంగా ఉన్నాయని, ఎలాంటి సవాళ్లు లేవని అప్రమత్తత వీడి కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతే, మనుషుల్లో ఉన్న నైపుణ్యాలు, శ్రమించే తత్వం చచ్చిపోతాయి. కష్ట సమయం వచ్చినప్పుడు ఎదుర్కొనే సామర్థ్యం లేక తీవ్రంగా దెబ్బతింటారు.
అలాగే ఒకే ప్రొఫేషన్‌లో, ఒకే స్థానంలో దొరికే కొద్దిపాటి భద్రతకు అలవాటు పడిపోతే జీవితంలో ఎప్పటికీ ఉన్నత స్థాయికి ఎదగలేరు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే జీవితంలో గొప్ప విజయాలు సాధించడం సాధ్యమవుతుంది.
Also Read: