Tirumala Salakatla Brahmotsavam 2026: ఆలయ యాగశాలలో అంకురార్పణ వేడుకలు జరిగాయి. భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్టమన్నుతో నిండిన పాత్రల్లో నవధాన్యాలను నాటారు. వేద మంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాల మధ్య అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా విజయవంతంగా జరగాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని సంకల్పిస్తూ ఈ క్రతువును చేస్తారు. అంకురార్పణలో నాటిన నవధాన్యాలను బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా కాపాడుతారు. ఉత్సవాల ముగింపు రోజున వీటిని స్వామివారికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి మరియు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.